- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీవో 252 ను తక్షణమే సవరించాలి : చందునాయక్
దిశ, అచ్చంపేట : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ జీఓ నెం.252ను తక్షణమే

దిశ, అచ్చంపేట : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ జీఓ నెం.252ను తక్షణమే సవరించాలని జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (TUWJ-H-143) ఎల్. చందునాయక్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఈ జీఓ అమలవుతుండటం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు హక్కుగా అందించాల్సిన అక్రిడేషన్ కార్డుల్లో కోత విధించడం తగదని, గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గస్థాయి, మండల స్థాయి అక్రిడేషన్ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే జర్నలిస్టులకు అందించాల్సిన ఆర్టీసీ బస్ పాస్‌కు సంబంధించిన స్పష్టమైన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు.
కొత్త జీవోతో అక్రిడేషన్ వచ్చే పరిస్థితి లేదు
కొత్త జీఓ ప్రకారం.. అన్ని మండలాలకు, అన్ని పత్రికలకు అక్రిడేషన్ కార్డులు వచ్చే పరిస్థితి లేదని, రూరల్ సెంటర్ల పేరుతో పనిచేస్తున్న అనేక మంది ఫీల్డ్ జర్నలిస్టులు అక్రిడేషన్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో ఒక పత్రికకు రెండు, మూడు కార్డులకు మించి అక్రిడేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి 252 జీవోలో లేదని ఇది తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 252 జీఓ జర్నలిస్టుల్లో గందరగోళం, ఆందోళనను సృష్టించిందని, జర్నలిస్టులను విభజించే విధంగా ఉన్న ఈ జీఓను ప్రభుత్వం పునఃసమీక్షించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా రంగానికి గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు పట్టుకొమ్మలుగా పనిచేస్తున్నారని అలాంటి గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు నిబంధనలు కఠిన తరం చేస్తూ కోతలు విధించే విధంగా ప్రభుత్వం జీవో తీసుకురావడం బాధాకరమన్నారు. డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల విస్తరణతో జర్నలిజం స్వరూపమే మారిపోయిందని, డెస్క్ జర్నలిస్టులు కూడా ఫీల్డ్‌లో పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ నేపథ్యంలో డెస్క్–ఫీల్డ్ అనే భేదాన్ని కొనసాగించడం సరికాదన్నారు. వెజ్ బోర్డులు లేకపోవడం, కార్మిక చట్టాలు అమలుకాకపోవడం వల్ల జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నెల తిరిగినా జీతాలు అందని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అక్రిడేషన్ పేరుతో కోతలు విధించడం అత్యంత అన్యాయమని విమర్శించారు. అక్రిడేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వమే జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని, ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చందునాయక్ స్పష్టం చేశారు.






