హెచ్. రమేష్ బాబుకు గద్దర్ ఫిలిం అవార్డు 

by Ratna Kumari |

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డులు-2025లో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన రచయిత, తెలంగాణ సినిమా పరిశోధకుడు హెచ్. రమేష్ బాబుకు ఉత్తమ రచయితగా విమర్శకుల విభాగంలో అవార్డు రావడం పట్ల పలువురు సాహితీ, సాంస్కృతిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

హెచ్. రమేష్ బాబుకు గద్దర్ ఫిలిం అవార్డు 
X

దిశ, కందనూల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డులు-2025లో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన రచయిత, తెలంగాణ సినిమా పరిశోధకుడు హెచ్. రమేష్ బాబుకు ఉత్తమ రచయితగా విమర్శకుల విభాగంలో అవార్డు రావడం పట్ల పలువురు సాహితీ, సాంస్కృతిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల పొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య మాట్లాడుతూ హెచ్. రమేష్ బాబు నిత్య పరిశోధకుడిగా, సినిమా చరిత్రకారుడిగా తెలుగు సినీ రంగానికి విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. సమాజం విస్మరించిన దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్ల గురించి పరిశోధన చేసి అనేక రచనలు చేశారని అన్నారు.


ఇటీవల రవీంద్రభారతిలో ఆవిష్కరించిన “హెచ్.ఎం. రెడ్డి తెలుగు సినిమా పితామహుడు”, “చిల్లర దేవుళ్లు” వంటి పుస్తకాలు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. సావిత్రి, కన్నాంబ, రఘుపతి వెంకయ్య నాయుడు, ఆదూర్తి సుబ్బారావు వంటి ప్రముఖులపై రాసిన పుస్తకాలు తెలుగు సినిమా చరిత్రకు దర్పణాలుగా నిలుస్తాయని తెలిపారు. ఇరవై ఏళ్ల క్రితమే “పాలమూరు వెలుగులు” పేరిట ప్రజల మనిషి డాక్టర్ బాలకృష్ణయ్య, పాలెం సుబ్బయ్య, పల్లెర్ల హన్మంతరావు వంటి ప్రముఖులపై రచనలు చేశారని చెప్పారు. అలాగే తెలంగాణ సాయుధ పోరాట యోధుడు శ్రీనివాసరావు, స్వాతంత్ర్య సమరయోధుడు పి. సుదర్శన్ రావు జీవిత చరిత్రలను కూడా రచించారని వివరించారు. గద్వాల, వనపర్తి, పాలెం డిగ్రీ కళాశాలల స్వర్ణోత్సవ సంచికలు సహా అనేక గ్రంథాలు రచించిన హెచ్. రమేష్ బాబుకు ఈ అవార్డు రావడం నాగర్ కర్నూల్ జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ అవార్డును ఈ నెల 19న ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. హెచ్. రమేష్ బాబుకు అవార్డు రావడం పట్ల సాహితీవేత్తలు వహీద్ ఖాన్, కందికొండ మోహన్, ఎదిరెపల్లి కాశన్న, కల్వకోల్ మద్దిలేటి, ముచ్చర్ల దినకర్, వెంకట్ పవార్, నీరటి బాలిశ్వర్, మహమ్మద్ ఖాజా హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Next Story