సభ్యత్వం ఉంటేనే యూరియా బస్తా.. రైతులకు చుక్కలు చూపిస్తున్న FPCL సంస్థ

by Bhoopathi Nagaiah |

యూరియా పంపిణీలో రాష్ట్రంలో అందరిది ఒకదారైతే.. రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్‌ది మరో దారిలా ఉంది.

సభ్యత్వం ఉంటేనే యూరియా బస్తా.. రైతులకు చుక్కలు చూపిస్తున్న FPCL సంస్థ
X

దిశ, అచ్చంపేట : యూరియా పంపిణీలో రాష్ట్రంలో అందరిది ఒకదారైతే.. రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్‌ది మరో దారిలా ఉంది. రైతులు యాప్‌లో తమ అవసరాల కోసం యూరియాను బుక్ చేసుకున్నా, వారికి కోత విధించడమే కాకుండా ఒక్కో బస్తా మీద అదనంగా డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు తెరలేపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడు నెలల క్రితం అమ్రాబాద్ పీఏసీఎస్‌లో అక్రమాలు చోటు చేసుకోవడంతో జిల్లా అధికారులు చైర్మన్‌ను తొలగించారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నడుస్తున్న రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ (FPCL) నాబార్డ్ ఎన్జీవో సంస్థ గత కొంతకాలంగా ఎరువులను విక్రయిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. యూరియా అమ్మకాల్లో ఆంక్షలు విధిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా ఎన్జీవో సంస్థలో రూ.1100 చెల్లించి సభ్యత్వం తీసుకుంటేనే యూరియా ఇస్తామంటూ కొర్రీలు పెడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాక బస్తాకు రూ.30 నుంచి రూ.300 అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధిక ధరలు వసూలు చేస్తుంది నిజమే..

రైతుల ఫిర్యాదుపై దిశ రైతు ఉత్పత్తి దారుల కేంద్రం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవో రమణి వివరణ కోరగా.. బస్తాకు రూ.30 అదనంగా విక్రయించాలని డైరెక్టర్లే నిర్ణయించారని, దానికి తనకు సంబంధం లేదన్నారు. ఆన్‌లైన్‌లో యూరియా బస్తాలు బుక్ చేసుకున్నా కొందరి రైతులకు సర్ధుబాటు చేసేందుకు తక్కువ బస్తాలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై ఏవో రమేష్ రెడ్డి వివరణ కోరగా.. ఎన్జీవో సంస్థ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు.ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీల కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే యూరియా సరఫరాలోనూ కోత విధిస్తున్నట్లు రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు. అడ్జెస్ట్ మెంట్ కోసమే అలా చేస్తున్నారని మండల వ్యవసాయ అధికారి సైతం వారికే వంతపాడారు.

Next Story