- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీటీజీ హాస్టల్‌లో విషాహారం కలకలం.. 70 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు
గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రతీకగా ఉండాల్సిన పీటీజీ మన్ననూర్ హాస్టల్‌లో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, బల్మూర్: గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రతీకగా ఉండాల్సిన పీటీజీ మన్ననూర్ హాస్టల్‌లో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ పాయిజన్ కారణంగా దాదాపు 70 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.విద్యార్థుల ఆరోపణల ప్రకారం, హాస్టల్‌లో చాలా కాలంగా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదని, ఆహార నాణ్యత అత్యంత దారుణంగా ఉందని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని చెబుతున్నారు. ప్రతిరోజూ పురుగులు పడిన అన్నం, నాసిరకం కూరలే వడ్డిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
తక్షణమే సమగ్ర విచారణ జరిపి..
ఈ సమస్యలను పలుమార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా, ఏం కాదు... తినండి అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సమస్యలను ఉన్నతాధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని, ఫలితంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఘటనతో ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ పిల్లల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్‌లో ఆహార నాణ్యత, తాగునీటి సౌకర్యాలు, పరిశుభ్రతపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు అత్యవసరంగా స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి ఏర్పాట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.






