నోటీసుల్లేవు.. పరిహారంపై అయోమయం!

by Ajay Maddhiboyina |

జాతీయ రహదారి నిర్మాణానికి చేపట్టిన భూసేకరణలో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని భారత్‌ మాల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నోటీసుల్లేవు.. పరిహారంపై అయోమయం!
X

దిశ, దేవరకద్ర : జాతీయ రహదారి నిర్మాణానికి చేపట్టిన భూసేకరణలో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని భారత్‌ మాల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల-మరికల్-దేవసూగుర్ జాతీయ రహదారి-167 నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎంత భూమి పోతుందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. కనీసం అవార్డు నోటీసులు జారీ చేయకుండానే పరిహారం తమ ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెబుతుండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

అసలు ఏం జరిగింది?

ప్రాజెక్టు కోసం చేసిన ప్రాథమిక సర్వే నోటీసులను కూడా ఇవ్వకుండా కొన్ని గ్రామాల్లో పోలీసులు, సిబ్బందిని పెట్టి, రైతుల ఫోన్లు గుంజుకుని సర్వే చేశారని బాధితులు వాపోతున్నారు. రైతుల అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకోవడం కోసం గ్రామ సభలు నిర్వహించలేదు. మార్కెట్ విలువపై చర్చ అంటూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రైతులకు కేవలం ఫోటోలు తీసుకుని, రెండు నిమిషాల్లోనే సమావేశం ముగించారని, ఎలాంటి చర్చలు జరగలేదని రైతులు చెబుతున్నారు.

నోటీసులు లేకుండానే పరిహారం!

సమావేశం తర్వాత 3జి నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పి, భూసేకరణలో ఏ రైతుకు ఎంత భూమి, బావులు, బోరు బావులు, చెట్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, కట్టడాలు పోతున్నాయో, వాటికి ఎంత నష్టపరిహారం ఇస్తున్నారో, రోడ్డు మ్యాప్‌ వివరాలు ఏమీ చెప్పకుండానే... పరిహారం సొమ్మును నేరుగా ఖాతాలలో జమ చేస్తామని రెవెన్యూ అధికారులు అడుగుతున్నారు. ఇందుకు పాస్ బుక్, బ్యాంకు ఖాతా బుక్, పాన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ప్రశ్నిస్తే బెదిరింపులు!

ఈ విధానంపై రైతులు అధికారులను ప్రశ్నిస్తే, "ఇలాగే ప్రశ్నిస్తూ పోతే ప్రభుత్వం ఆర్మీ, పోలీసులను పెట్టి రోడ్డు నిర్మాణం చేస్తుంది, పరిహారాన్ని కూడా కోర్టులో జమచేస్తుంది. అప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడొచ్చే పరిహారం కూడా రాదు" అంటూ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. దీంతో పంటలు పండించే భూములను కోల్పోయి, జీవనోపాధి పోతుందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక రైతుకు అన్యాయం:

దేవరకద్ర మండలం పెద్ద గోపులాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల పద్మమ్మకు సర్వే నెంబర్ 101లో రోడ్డు కోసం సర్వే చేసిన హద్దు రాళ్ల మధ్య 19 గుంటల భూమి పోయింది. కానీ, అధికారుల అవార్డు నోటీసులో కేవలం 9 గుంటల భూమి మాత్రమే నమోదు అయిందని, మిగతా 10 గుంటల భూమి నమోదు కాలేదని బాధితురాలు అధికారులను కోరుతున్నారు. ఈ విషయంపై దేవరకద్ర తహసిల్దార్ దీపికను వివరణ కోరగా, సర్వే చేసి రిపోర్టును పై అధికారులకు పంపిస్తామని తెలిపారు. అధికారులు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Next Story