యూరియా కోసం రైతుల రాస్తారోకో

by velandi.Saikiran |

యూరియా కోసం రైతులు రాస్తారోకో చేసారు. నెల రోజులుగా ఎరువుల కోసం పడికాపులు కాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని

యూరియా కోసం రైతుల రాస్తారోకో
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి/భూత్పూర్: యూరియా కోసం రైతులు రాస్తారోకో చేసారు. నెల రోజులుగా ఎరువుల కోసం పడికాపులు కాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మహబూబ్ నగర్ జిల్లా బస్ స్టాండ్ ఎదుట అంబేద్కర్ చౌరస్తాలో, నేషనల్ హైవే 44 భూత్పూర్ చౌరస్తాలో రైతులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. తమకు టోకెన్లు ఇచ్చి యూరియా ఇవ్వకపోవడంతో అసహనంతో రగిలిపోయిన రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతుల నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పొలాలు, ఇండ్ల వద్ద పనులు మానేసి యూరియా పంపిణీ కేంద్రాల వద్దనే నిద్రిస్తున్నారని, 10, 15 రోజుల క్రితం అధికారులు టోకెన్లు జారీ చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహించారు.

ఇంతవరకు యూరియా జాడే లేదని విమర్శించారు. పంట వేసిన 15 రోజుల్లో యూరియా వేయాలని, నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు యూరియా సరఫరా చేయకపోవడం దారుణమని ఆరోపించారు. ప్రక్క రాష్ట్రం ఆంధ్రాలో కేంద్ర మంత్రులతో మాట్లాడి యూరియా తెచ్చుకుంటున్నారని, ఇక్కడి కేంద్ర మంత్రులు,ఎంపీలు రైతుల గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. . రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ని అందుబాటులోకి తేవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇలాగే కొనసాగితే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

Next Story