- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు ప్రయోజనమే ప్రధానం : కలెక్టర్ బాదావత్ సంతోష్
దిశ, కందనూల్ : రైతు ప్రయోజనమే ప్రధానంగా చూడాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావాల్సిన వసతులు కల్పించాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్

దిశ, కందనూల్ : రైతు ప్రయోజనమే ప్రధానంగా చూడాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావాల్సిన వసతులు కల్పించాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని ఉయ్యాలవాడ సమీపంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వానాకాలం 2025–26 ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లపై నిర్వహిచిన సన్నాహక శిక్షణా కార్యక్రమంలో నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వసతులు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా, సకాలంలో చెల్లింపులు జరిగే విధంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి స్థాయిలో ప్రణాళికబద్ధంగా నిర్వహించాలన్నారు. రైతుల కష్టం వృథా కాకూడదని, వారు అమ్మిన ధాన్యానికి గరిష్ట మద్దతు ధర చెల్లింపులు 48 నుంచి 72 గంటల్లోపు వారి ఖాతాల్లో జమ కావాలన్నారు. మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రైతుల నష్టానికి కారణమయ్యే విధమైన ఆలస్యాలు జరగకుండా చూడాలని సూచించారు. మిల్లర్లు రైతులకు అవరోధాలు సృష్టిస్తే లేదా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వం ఉద్దేశం రైతు సంతోషం, రైతుకు న్యాయం జరగడమేనన్నారు. ఎవరైనా దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, తేమ కొలిచే పరికరాలు, గడ్డి తొలగించే యంత్రాలు, తాత్కాలిక షెడ్లు, వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా కప్పు సౌకర్యం వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలని ఆయన చెప్పారు. వర్షాల కారణంగా ధాన్యం పాడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం తరలింపును ఆన్లైన్ విధానంలో నమోదు చేసి, రైతుల ఖాతాల్లో చెల్లింపులు వెంటనే జరగేలా చూడాలన్నారు. పారదర్శకత, సమయపాలన ఈ సీజన్ యొక్క ప్రధాన లక్ష్యాలు కావాల ని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం సరిగ్గా కొలవడం, ధాన్యం నాణ్యత పర్యవేక్షణ, మిల్లులకు తరలింపుపై డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించాలని ఆయన సూచించారు.
వరి కోతలు ప్రారంభమైన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు రైతుల అవసరాలకు అనుగుణంగా హార్వెస్టర్‌లను సమీకరించి అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు తమ ధాన్యం తరలించడానికి వాహనాల కోసం ఇబ్బంది పడకుండా ట్రాన్స్ పోర్ట్ యజమానులు ముందస్తు ప్రణాళికతో వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు తమ ధాన్యం కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వెంటనే మిల్లుకు తరలించే విధంగా సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటుచేయాల, ధాన్యం నిల్వలు పెరగకూడదన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి మండలంలో కొనుగోలు కేంద్రాల పనితీరు, చెల్లింపుల స్థితి, ధాన్యం తరలింపు వివరాలు రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తారన్నారు. ఎక్కడైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, రైతులు ఫిర్యాదు చేస్తే, వెంటనే విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రతి ధాన్యం గింజ రైతు కష్టానికి ప్రతీక అన్నారు. రైతు చెమట చిందించి పండించిన ఆ ధాన్యాన్ని గౌరవంగా కొనుగోలు చేసి, అతనికి గౌరవప్రదమైన ధర చెల్లించడం మన బాధ్యత అని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. ఈ సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ పి అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు డీఆర్డిఓ చిన్న ఓబులేసు, జిల్లా సహకార అధికారి రఘు, జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంతరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి నర్సింగరావు పాల్గొన్నారు.






