గోవ‌ర్ద‌న‌గిరిలో పేలుడు ప‌దార్థాలు

by Nallavelli.Anjaneyulu |

మండల పరిధిలోని గోవర్ధనగిరిలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరో 8 నాటు బాంబులను ఊర‌ చెరువులోకి విసిరి వేశారు.

గోవ‌ర్ద‌న‌గిరిలో పేలుడు ప‌దార్థాలు
X

దిశ‌, వీప‌న‌గండ్ల : మండల పరిధిలోని గోవర్ధనగిరిలో పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరో 8 పేలుడు ప‌దార్థాల‌ను ఊర‌ చెరువులోకి విసిరి వేశారు. పోలీసులు గ్రామస్తుల కథన ప్రకారం.. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన మేకల శేఖర్, రమణమోని మహేష్, ఎం.డి. చాంద్ భాషా ముగ్గురు వ్యక్తులు శనివారం పశువులను మేప‌డానికి గ్రామ ఊరు చెరువు అలుగు సమీపానికి వెళ్లారు. ఈ క్రమంలో గోవర్ధనగిరి నుంచి గోపాల దిన్నెకు వెళ్లే మార్గంలో పందుల షెడ్డు వద్ద ఒక చెట్టుపై అనుమానాస్పదంగా కవర్ ని గమనించారు. ఆసక్తితో ఆ కవరును కిందికి దించి తెరిచి చూడగా.. అందులో 5 గుండ్రంగా ఉన్న వాటిని గుర్తించారు.

అందులో ఒకటి పశువుల కాపరి మేకల శేఖర్ రాతిపై పెట్టి కొడుతుండగా అకస్మాత్తుగా అది భారీ శబ్దంతో పేలిపోయింది.ఈ ఘటనలో శేఖర్ ఎడమచేతి తీవ్రంగా దెబ్బతిని, తీవ్ర రక్తస్రావం జరిగింది. గాయపడిన శేఖర్‌ను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా వీపనగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వనపర్తి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన పందుల యజమాని ఎరుకలి బిచ్చన్న అక్కడికి చేరుకొని పేలుడు పదార్దాలను పారేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై నరేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పెద్ద ఎత్తున నాటు బాంబుల ఘటన ఏదీ జరగలేదని స్పష్టం చేశారు.అడవి పందుల వేట కోసం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తయారు చేసిన చిన్నపాటి పేలుడు పదార్థం మాత్రమే అక్కడ కనిపించిందని తెలిపారు.సాధారణంగా ఈ విధమైన పదార్థాలను పందులు తింటే వాటి మూతి పేలి అక్కడికక్కడే చనిపోతాయని, అందువల్ల వేటగాళ్లు ఇటువంటి పద్ధతులను ఉపయోగిస్తారని వివరించారు.అయితే ఈ సంఘటనను అతిశయోక్తిగా చూపిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రజలు అలాంటి వార్తలను నమ్మవద్దని ఎస్ఐ నరేష్ విజ్ఞప్తి చేశారు. అధికారిక సమాచారం లేకుండా వచ్చే వీడియోలు, పోస్టులను పంచుకోవడం వల్ల అనవసర ఆందోళన నెలకొనే అవకాశం ఉందని హెచ్చరించారు.

Next Story