- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..!
దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లా, కేటీదొడ్డి మండలం, నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు.

దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లా, కేటీదొడ్డి మండలం, నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ ఉద్దేశపూర్వక హత్య వెనుక సూత్రధారిగా భావిస్తున్న నందిన్నె గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. చివరకు మృతుడి కుటుంబ సభ్యుల అనుమానాలే నిజమని తేలుస్తూ.. ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్యేనని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్త చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. దాదాపు ఇది రోడ్డు ప్రమాదం కాదు హత్యే అని నిర్ధారించినట్లు తెలుస్తోంది. కేవలం ఒక్కరోజులోనే గద్వాల సీఐ శ్రీనివాస్ బృందం సేకరించిన ఆధారాల ప్రకారం.. హత్యకు కుట్ర పన్నిన ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అదుపులో ఉన్న వ్యక్తిని లోతుగా విచారించడం ద్వారా ఈ హత్య వెనుక ఉన్న రాజకీయ లేదా వ్యక్తిగత కక్షల పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ఘోరానికి నెల రోజుల ముందు నుంచే ప్రణాళిక రచించినట్లు, రాయలసీమ సుపారీ గ్యాంగ్‌ను వినియోగించినట్లు అనుమానిస్తున్నారు.
హత్య అమలు చేసిన వ్యక్తికి ₹3,000 ఫోన్ పే ద్వారా బదిలీ అయినట్లు కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. శుక్రవారం చిన్న భీమరాయుడు తన యూనికార్న్ బైక్ పై వెళ్తుండగా, జాంపల్లి వద్ద గుర్తుతెలియని బొలెరో వాహనం (నెంబర్: ఏపీ 39 WH 3068) బలంగా ఢీకొట్టి, ఆయన్ను దాదాపు 250 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్, కర్నూల్ జిల్లా, గోనెగండ్లకు చెందినదిగా గుర్తించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారయ్యాడు. మరోవైపు, నిందితులను అధికారికంగా అరెస్ట్ చేసి, న్యాయం జరిగేంత వరకు దహన సంస్కారాలు నిర్వహించేది లేదంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు గద్వాల పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడి విచారణ జరుగుతున్న నేపథ్యంలో, త్వరలోనే ఈ హత్య కేసులో పూర్తి వివరాలు, నిందితుల అరెస్ట్‌లు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ కేసు జిల్లాలో తీవ్ర రాజకీయ, సామాజిక చర్చనీయాంశంగా మారింది.






