- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీమంత్రీ...నీ రాజకీయ నాటకాలు ఆపు
మాజీ మంత్రీ ప్రజలను మభ్యపెట్టే నీ రాజకీయ నాటకాలు ఇకనైనా మానుకో అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరోక్షంగా మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మాజీ మంత్రీ ప్రజలను మభ్యపెట్టే నీ రాజకీయ నాటకాలు ఇకనైనా మానుకో అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరోక్షంగా మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరువుకట్టపై నిలబడి మాజీమంత్రి చేసే నాటకీయ ప్రదర్శనలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా, ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన సమయంలో మహబూబ్‌నగర్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణానికి విద్యాసంస్థలు, ఐఐఐటీ, ఇంజినీరింగ్ కళాశాలలు తీసుకురావాలని అప్పటి సీఎం కేసీఆర్ వద్ద ఒక్కసారి కూడా ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై మాట్లాడని నీవు, వ్యక్తిగత కక్షలకు పాల్పడి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయ స్వార్థమేనని మండిపడ్డారు. నీవల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయాయో, ఎంతమంది ప్రజలు ఆవేదన చెందారో, ఉద్యమకారుల కుటుంబాలు సైతం నాడు ఎంత ఏడ్పించావో జిల్లా వాసులకు బాగా తెలుసని అన్నారు. మెయిన్ రోడ్డుపై కప్పు-సాసర్, వాటర్, బొమ్మలు చూపించి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం ప్రజలను అవమానించడమేనని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో అభివృద్ధి చూపిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి 2 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేయడం చరిత్రలోనే పెద్ద ముందడుగని అన్నారు. గతంలో ఎక్కడా లేని విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు 603 కోట్లు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు శాశ్వత తాగునీటి సరఫరాకు 220 కోట్లు మంజూరు చేయించామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాజీమంత్రి చేస్తున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే 'యెన్నం' స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఆనంద్ గౌడ్, వినోద్ కుమార్, చంద్రకుమార్ గౌడ్, అమరేందర్ రాజు పాల్గొన్నారు.






