- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శిఖం భూమిపై ప్రహరీ.. భూ బకాసురులకు అధికారుల అండ?
పట్టణంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా.. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి.

దిశ, కల్వకుర్తి: పట్టణంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా.. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. భూములను ఆక్రమించుకున్న వారికి కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, కఠిన చర్యలు తీసుకోవడం శూన్యం. దీంతో ప్రజల్లో అధికార యంత్రాంగంపై నమ్మకం సన్నగిల్లుతోంది.
ఖరీదైన శిఖం కబ్జా: పట్టించుకోరా? మున్సిపల్ పరిధిలోని 255 సర్వే నంబర్‌లో గల కుమ్మరి కుంట చెరువు శిఖం భూమి అత్యంత ఖరీదైంది. ఈ ప్రాంతం పట్టణానికి, జాతీయ రహదారికి కూత వేటు దూరంలో ఉండటంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇటువంటి విలువైన శిఖం భూమిలో కొంత భాగాన్ని ఓ మిల్లు యజమాని (సేటు) తన వశం చేసుకొని, ఏకంగా 10 అడుగుల ఎత్తులో ప్రహరీ గోడ నిర్మించారు. ఈ కబ్జాపై 'దిశ' దినపత్రిక గతంలో ఆరు వరుస కథనాలను ప్రచురించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
అధికారుల 'తొండి' వైఖరి 'దిశ' కథనాలతో మేల్కొన్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఈ ఏడాది ఆగష్టు 27న కుమ్మరి కుంట చెరువును పరిశీలించారు. కబ్జా జరిగినట్లు గుర్తించి, రాళ్లతో హద్దులు పాతారు. మిల్లు యజమానికి నోటీసులు అందజేసి, ప్రహరీ గోడను వెంటనే నేలమట్టం చేయాలని హుకుం జారీ చేశారు. అయితే, ఆ ఆదేశాల అమలు మాత్రం ఇప్పటికీ శూన్యంగానే ఉంది. రెండు శాఖల మధ్య సమన్వయ లోపమనో, లేదా స్థానిక/పై స్థాయి ఒత్తిడి ఉండటం వల్లేనో గానీ... అధికారులు మిల్లు యజమానిపై చర్యలు తీసుకోకుండా నివేదికలు పంపి మిన్నకుండిపోవడంలో పరమార్థం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు.
ప్రజాధనం తీసుకుంటూ.. ధర్మాన్ని విస్మరిస్తూ.. రోజులు, నెలలు గడుస్తున్నా.. అన్యాక్రాంతమైన చెరువు భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెనకడుగు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. విధులు నిర్వహించే అధికారులు తమకేమీ తెలియనట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కావని పట్టణ ప్రజలు గట్టిగా కోరుతున్నారు. ప్రజలు కట్టే పన్నులపై నెలసరి వేతనాలు తీసుకుంటున్న అధికారులు.. ఉద్యోగ వృత్తిలో న్యాయం చేయడానికి పూనుకోకపోవడంతో ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే ఉద్దేశపూర్వకంగా అలసత్వం వహిస్తే, పట్టణంలో ఎక్కడ కబ్జా చేసినా అడిగే నాథుడే ఉండడనే అంశం భూబకాసురుల మదిలో బలంగా నాటుకుపోతుంది. గతంలోనూ, నేడు కూడా అదే తంతు కొనసాగుతుండటంతో ఒక వర్గంపై ఒక వర్గం దూషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభుత్వ స్థలాలు కబ్జాదారుల వశమేనా? ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులకు అధికారులు అండగా నిలిస్తే, ప్రభుత్వ స్థలం ఏంటి, ప్రైవేట్ స్థలాన్ని కూడ కబ్జా చేసే 'మేధావులు' పట్టణంలో ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కబ్జాల పరంపర సాగిస్తున్న ఇలాంటి భూబకాసురాలపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే.. ప్రభుత్వ చెరువులు, కుంటలు, స్థలాలు, పార్కులు కేవలం చెప్పుకోవడానికి తప్ప చూసుకోవడానికి కనిపించవని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, మిల్లు యజమానితో పాటు నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని దిశ డిమాండ్ చేస్తోంది.






