కావేరమ్మపేటలో ఈద్గా స్థల వివాదం

by Nallavelli.Anjaneyulu |

పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఈదుల్ ఫితర్ నమాజ్ చదవడానికి ముస్లింలకు పర్మినెంట్ ఈద్గా లేకపోవడంతో కావేరమ్మ పేట లోని సంత బజార్ ప్రాంతంలోని ఖాళీ స్థ‌లంలో ఈద్ నమాజ్ చదవడానికి ముస్లింలు టెంట్లు వేసేందుకు సన్నద్ధం అయ్యారు.

కావేరమ్మపేటలో ఈద్గా స్థల వివాదం
X

దిశ, జడ్చర్ల : పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఈదుల్ ఫితర్ నమాజ్ చదవడానికి ముస్లింలకు పర్మినెంట్ ఈద్గా లేకపోవడంతో కావేరమ్మ పేట లోని సంత బజార్ ప్రాంతంలోని ఖాళీ స్థ‌లంలో ఈద్ నమాజ్ చదవడానికి ముస్లింలు టెంట్లు వేసేందుకు సన్నద్ధం అయ్యారు. ఈ ప్రాంతంలో అనుమతులు లేకుండా ఏర్పాట్లు చేయడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ జడ్చర్ల మున్సిపాలిటీ కమిషనర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ సీఐ కమలాకర్ టెంట్ ఏర్పాటు స్థలం వద్దకు చేరుకొని అనుమతులు లేకుండా ఈ ప్రాంతంలో టెంట్లు వేయడానికి వీల్లేదని.. ఎప్పటిలాగే యధావిధిగా ఈద్ నమాజ్ చదువుకోవాలని తేల్చి చెప్పారు. దీంతో కావేరమ్మపేట ముస్లిం సోద‌రులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈద్ నమాజ్ కొరకు ఈద్గా స్థలం కేటాయిస్తానని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. అయినా కూడా ఇంతవరకు ఆ ఊసే లేదని, ఇంతకాలం తాము దారులు- ఉలుమ్ లో ఉన్న కాంపౌండ్ వాల్ లో ఈద్ నమాజ్ చదివే వారమని తెలిపారు. ఈసారి వాళ్లు కూడా ఈ కాంపౌండ్ వాల్ లో ఈద్ నమాజ్ చదవడానికి వీల్లేదని తేల్చి చెప్పారని, దీంతో తాము నమాజ్ చదవడానికి గత్యంతరం లేకనే సంత బజార్ ప్రాంతంలో ఈద్ నమాజ్ చదవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. పాలకులు నాయకులు తమకు ఇచ్చిన మాట ప్రకారం.. ఈద్గా స్థలానికి కేటాయిస్తే ఈ సమస్య వచ్చేది కాదని తాము కూడా అందరిలాగానే ఈద్గాలోనే సంతోషం గా ఈద్ నమాజ్ చదివే వారమని తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించి ఈద్గా స్థలం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

ఈద్గా స్థ‌లం ప్రోసీడింగ్ సిద్ధంగా ఉంది : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

కావేర‌మ్మ‌పేట ముస్లింల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం.. కేటాయించ‌డానికి ప్రోసీడింగ్ సిద్ధంగా ఉంద‌ని.. అది క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఆమోదం పొందిన వెంట‌నే కావేర‌మ్మ‌పేట ముస్లింకు ఈద్ న‌మాజ్ చ‌ద‌వ‌డానికి స్థలం ప‌ర్మినెంట్ గా కేటాయించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. అప్ప‌టివ‌ర‌కు య‌దావిధిగా దారులులోని కంపౌండ్ వాల్ లోనే ఈద్ న‌మాజ్ చ‌ద‌వాల‌ని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫోన్ లో స్పందించారు. దీంతో దారుల్ ఉలూమ్ కంపౌండ్ లో న‌మాజ్ చేసేందుకు ముస్లిం సోద‌రులు అంగీక‌రించారు.

Next Story