భారీ వర్షం.. జన జీవనం అస్తవ్యస్తం

by Ratna Kumari |

దిశ, నవాబుపేట : మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వరదల కారణంగా అతలాకుతలమైన తమ బతుకులను బాగు చేసే వారి కోసం వరద

భారీ వర్షం.. జన జీవనం అస్తవ్యస్తం
X

దిశ, నవాబుపేట : మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వరదల కారణంగా అతలాకుతలమైన తమ బతుకులను బాగు చేసే వారి కోసం వరద బాధితులు ఎదురుచూస్తున్నారు. భారీ వర్షం కారణంగా వచ్చిన వరదలు భారీ నష్టాన్ని చేకూర్చాయి. వరదల వల్ల పటిష్టంగా ఉన్న బీటీ రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఒక్కో దగ్గర డైనమెట్లు పెట్టి రాళ్ళను పేలిస్తే ఎలాగైతే రాళ్లు పేలిపోతాయో అలాగే రోడ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్ల విధ్వంసంతో ప్రజల ప్రయాణాలకు తీవ్ర అవరోధం నెలకొంది. నిత్యం వేలాది మంది ప్రయాణాలు కొనసాగించే రోడ్లు పూర్తిగా ధ్వంసమవ్వ‌డంతో వాటిపై నరకయాతన పడుతూ వాహన చోదకులు ప్రయాణాలు చేస్తున్నారు. భారీ వర్షం వరద నీటి ఉధృతి కారణంగా పలు ఇల్లు నేలమట్టం కావడంతో వాటిలో నివాసముండేవారు నిరాశ్రయులయ్యారు. వరద నీరు ఉప్పెనెలా వచ్చి ఇళ్లల్లోకి చేరడంతో ఇళ్లల్లో సమకూర్చుకున్న నిత్యావసర సరుకులు నీట మునగడంతో ఆ ఇళ్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రైతులు తీవ్ర ఆవేద‌న‌..

వరద నీటి ఉధృతి కారణంగా పొలాలలో సాగు చేసిన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల చెరువులు, కుంటలకు గండ్లు పడడంతో నీరు వృధాగా పోతుంది. చెరువులు, కుంటలలో మత్స్యకారులు పెంచిన చేపలు వరదల ఉధృతి కారణంగా కొట్టుకుపోయాయి. ఇలాంటి అనేక విపరీత సంఘటనలు భారీ వర్షం కారణంగా చోటు చేసుకున్నా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవడం పట్ల వరద బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తూతూ మంత్రంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనలు జరపడం వల్ల తమకు ఒరిగిందేమీ లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి పర్యటనల వల్ల తమకు ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదని బాధితులు వాపోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారుల చేత సర్వే చేయించి వరద నష్టాన్ని అంచనా వేసి వరద బాధితులకు తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతగానో ఉంది.

ప్ర‌భుత్వ సాయం కోసం ఎదురుచూపు

వరదల కారణంగా ప్రభుత్వ సహాయం కోసం వరద బాధితులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వరదల కారణంగా ధ్వంసమైన రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. చెరువులు, కుంటలకు పడ్డ గండ్లను పూడ్చాలని.. వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాల‌ని, నిత్యావసర సరుకులు సమకూర్చి వారిని ఆదుకోవాల‌ని మొర‌ పెట్టుకుంటున్నారు. అందుకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

Next Story