- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పన్నుల వేటలో వేగం..అద్దెల వసూళ్లలో నిర్లక్ష్యం!
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ద్వంద్వ వైఖరి ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది.

పన్నుల వేటలో వేగం..
అద్దెల వసూళ్లలో నిర్లక్ష్యం!
- పాలమూరు కార్పొరేషన్ ఆదాయానికి భారీ గండీ
- రావాల్సిన ఆదాయం రూ.19.80 కోట్లు.. వస్తున్నది కేవలం రూ. 4 కోట్లే!
- సామాన్యులకు నోటీసులు.. వ్యాపారులకు రాయితీలా?
- కార్పొరేషన్ అధికారుల తీరుపై అనుమానాలు ?
దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ద్వంద్వ వైఖరి ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. పేద, మధ్యతరగతి ప్రజల నుంచి ఇంటి పన్నులు వసూలు చేసే క్రమంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న యంత్రాంగం కోట్లాది రూపాయల మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అద్దె బకాయిల విషయంలో మాత్రం మౌన ముద్ర దాల్చడం విస్మయానికి గురిచేస్తోంది. ఒకవైపు నిధుల కొరతతో అభివృద్ధి ఆగిపోతోందని సాకులు చెబుతూనే మరోవైపు కళ్లముందే కనిపిస్తున్న కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకోవడం వెనుక పెద్ద ఎత్తున అంతర్గత ఒప్పందాలు ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదాయానికి తూట్లు.. పడకేసిన వసూళ్లు
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో సుమారు 255 మున్సిపల్ షాపులు ఉన్నాయి. ఈ షాపులను అద్దె ప్రాతిపదికన కేటాయించగా, సుమారు 175 షాపుల్లో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ షాపుల ద్వారా మున్సిపాలిటీకి అద్దె రూపంలో సంవత్సరానికి రూ. 19 కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉండగా కేవలం 4కోట్లకు మించి రావడం లేదు. నెలకు రావాల్సిన ఆదాయం రూ. 1.60 కోట్లు కాగా ప్రస్తుతం వసూలవుతున్నది రూ. 34 లక్షలు మాత్రమే. అంటే ఏటా సుమారు రూ. 15 కోట్ల పైచిలుకు ఆదాయాన్ని అధికారులు గాలికి వదిలేస్తున్నారు. ఏడాది మొత్తం మీద రూ. 4 కోట్లు కూడా దాటని ఈ వసూళ్ల తీరు అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.
సామాన్యుడికి నోటీసులు.. బడా బాబులకు రాయితీలు!
మార్చి నెలాఖరు ముగిసినా పన్నుల వసూళ్ల వేటను అధికారులు ఆపడం లేదు. సామాన్యుల ఇళ్ల ముందుకు వెళ్లి టార్గెట్లు పూర్తి చేసేందుకు సర్వ శక్తులు వడ్డుతున్నారు. గడువు దాటితే జరిమానాలు విధిస్తామని, అవసరమైతే జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఇదే అధికారులు మున్సిపల్ కాంప్లెక్స్ లలో ఏళ్ల తరబడి అద్దెలు చెల్లించకుండా పాగా వేసిన బడా వ్యాపారుల జోలికి వెళ్లకపోవడం విడ్డూరం. గతంలో టెండర్ నిబంధనల ప్రకారం జరిగిన ఒప్పందాలను తుంగలో తొక్కి ప్రస్తుత మార్కెట్ రేటుకు కాకుండా నామమాత్రపు ధరలకు లేదా అస్సలు అద్దె కట్టకుండా వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజకీయ అండదండలే రక్షణ కవచమా?
అద్దె బకాయిలు ఇంత భారీగా పేరుకుపోవడానికి కారణం కేవలం అధికారుల నిర్లక్ష్యమే కాకుండా దీని వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. సదరు వ్యాపారులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటం వల్లే అధికారులు అటువైపు వెళ్లడానికి జంకుతున్నారని సమాచారం. నిబంధనల ప్రకారం అద్దె కట్టని వారి షాపులను వెంటనే సీజ్ చేయాల్సి ఉన్నా, ఫోన్ కాల్స్ తోనో లేదా ఇతర ప్రలోభాలతోనో ప్రక్రియను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారే ఇలా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవస్థాగత లోపాలపై విచారణ ఏదీ?
ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అధికారులపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అద్దె బకాయిదారులకు కొమ్ముకాస్తున్న క్షేత్రస్థాయి అధికారులపై తక్షణమే విచారణ జరపాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తన పద్ధతి మార్చుకోకపోతే, రావాల్సిన రూ. 19 కోట్ల ఆదాయాన్ని వసూలు చేయడంలో వైఫల్యం చెందితే పట్టణ అభివృద్ధి మరింత కుంటుపడే ప్రమాదం ఉంది. వెంటనే జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
అద్దె చెల్లించకపోతే సీజ్ చేస్తాం..
మహబూబ్ నగర్ మున్సిపల్ కాంప్లెక్స్ అద్దె బకాయిలను యజమానులు ఈ నెలాఖరులోగా చెల్లించాలి. లేని పక్షం లో చర్యలు తీసుకుంటాం. నోటీసులకు స్పందించని పక్షంలో తక్షణమే షాపులను సీజ్ చేసి స్వాధీనం చేసుకుంటాం.
- కార్పొరేషన్ కమిషనర్ రామాంజులరెడ్డి






