వెలుగులోకి కొత్త స్కామ్.. యాక్సిడెంట్ చేశావంటూ డబ్బులు వసూళ్లు!

by Jakkula.Mamatha |

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కేటుగాళ్లు జనాలను మోసం చేసేందుకు రోజుకో కొత్త వ్యూహాలు రచిస్తున్నారు.

వెలుగులోకి కొత్త  స్కామ్.. యాక్సిడెంట్ చేశావంటూ డబ్బులు వసూళ్లు!
X

దిశ,మేడ్చల్ బ్యూరో: ఈజీ మనీ కోసం అలవాటు పడిన కేటుగాళ్లు జనాలను మోసం చేసేందుకు రోజుకో కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా వాహనదారులను టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. వాహనాదారులను ఆపి, నీవు నాకు యాక్సిడెంట్ చేశావు.. నీ ర్యాష్ డ్రైవింగ్ వల్ల నాకు దెబ్బలు తగలడమే కాకుండా.. బైక్ డ్యామేజ్ అయిందని నయా స్టోరీ వినిపిస్తున్నారు. యాక్సిడెంట్ చేసి గాయపరిచినందుకు డబ్బులు ఇస్తావా? లేదంటే ఇష్యూ పెద్దదిగా చేయాలా..? అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో అత్యవసర పనుల పై వెళ్తున్న కొందరు వాహనదారులు నయానో.. భయానో ఇచ్చి వారిని వదిలించుకోగా, కొందరు వాహనదారులు కేటుగాళ్ల మోసాలను పసిగడుతున్నారు. మల్కాజ్గిరి కమిషనరేట్‌ బోయిన్ పల్లి ఠాణా పరిధిలో ఇటీవల వరుస సంఘటనలు జరుగుతున్నాయి.

కొత్త రకం దోపిడీ..

పాత బోయిన్ పల్లికి చెందిన అభినయ్ తన బైక్ పైన తాడుబంద్ కు వెళుతున్నాడు. బాపూజీనగర్ దాటిన తర్వాత ఓ అపరిచిత వ్యక్తి మరో బైక్ పై వచ్చి, అభినయ్ బైక్ ను అపాడు. నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చారు.. పక్కన వాహనదారులను చూసుకోకుండా ర్యాష్ గా బైక్ ను నడుపుతావా? తనకు యాక్సిడెంట్ చేసి వెళ్లిపోవడంతో.. నీ వల్ల నేను కింద పడిపోయాను.బైక్ డ్యామేజ్ అయ్యింది. నాకు గాయాలయ్యాయని సదరు వ్యక్తి అభినయ్‌ను గద్దించాడు. దీంతో కంగుతిన్న అభినయ్ తాను ఏ యాక్సిడెంట్ చేయలేదని వివరణ ఇవ్వగా, దాంతో ఆ అపరిచిత వ్యక్తి తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. దీంతో మీరు ఎక్కడ కింద పడ్డారో.. చెబితే, అక్కడికి వెళ్లి సీసీ కెమెరాలు చూద్దామని అభినయ్ కోరగా, అందుకు ఆ అపరిచిత వ్యక్తి అక్కడ సీసీ కెమెరాలు లేవన్నాడు.

అయితే అప్పటికే అపరిచిత వ్యక్తికి ఉన్న స్వల్ప గాయాలు పరిశీలించిన అభినయ్ నీకు వైద్యం చేయిస్తా.. ఆసుపత్రికి వెళ్దామా? అని అడిగితే, నీవు వైద్యం చేయిస్తే.. బైక్ ను రిపేర్ ఎవరు చేయిస్తారని దబాయించాడు. దీంతో మీకు ఎన్ని డబ్బులు కావాలని అడిగిన అభినయ్ ను .. రూ.5 వేలు ఇవ్వాలని అపరిచిత వ్యక్తి డిమాండ్ చేశాడు. తన వద్ద కేవలం రూ.500 లు మాత్రమే ఉన్నాయని.. రూ.5 వేలు కావాలంటే తనను ఫాలో కావాలని కోరగా, అపరిచిత వ్యక్తి అభినయ్ ను ఫాలో అయ్యాడు. తాడుబంద్ లోని పోలీస్ ఔట్ పోస్ట్ వద్దకు వెళ్లి అభినయ్ తన బైక్ ను అపగానే.. అతన్ని వెంబడించిన అపరిచిత వ్యక్తి అక్కడ పోలీసులు ఉంటారని గమనించి, వెనక నుంచి పారిపోయాడు. ఇలాంటి కొత్త రకం స్కామ్ బోయిన్ పల్లి ఠాణా పరిధిలో వరుసగా జరుగుతున్నట్లు పలువురు బాధితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కారులో వెళుతున్న ఓ వ్యక్తిని సైతం ఇదే తరహాలో సదరు అపరిచిత వ్యక్తి బెదిరించి రూ.7 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బైక్ లపైన వెళ్తున్న పలువురు వాహనాదారులను సైతం ఇదే తరహా స్కామ్ తో బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది.

విచారణ చేస్తున్నాం: బోయిన్ పల్లి ఇన్ స్పెక్టర్ తిరుపతి రాజు

బైక్ పై నుంచి కింద పడి గాయాలపాలైన ఓ అనుమానస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తిరుపతి రాజు తెలిపారు. అతని పాత హిస్టరీని వెరిఫై చేస్తున్నాం. అయితే అతనికి ఈ నేరాలతో సంబంధం ఉందా..? అనే కోణంలో విచారిస్తున్నాం. బాధితుల సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. నేరాలకు పాల్పడుతున్న వారి వివరాలు చెబితే, వారిని పట్టుకుని న్యాయ పరంగా శిక్షిస్తామని తెలిపారు.

Next Story