- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్వకుర్తిలో కుక్కల స్వైర విహారం
కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక కాలనీలో వరసగా కుక్కకాటు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక కాలనీలో వరసగా కుక్కకాటు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో 9వేల ఇళ్లు, 50వేలకు పైగా జనాభా ఉంది. ఈ జనాభాకు తోడు శునకాల సంఖ్య అధికమే. దాదాపు 1500 పై మాటే. మున్సిపాలిటీలో ఏ వీధి చూసిన గుంపులు గుంపులుగా ఉంటున్నాయి. మున్సిపాలిటిలో వీధి కుక్కలు బాట సారులను, చిన్నారులను అరుస్తూ.. వెంటాడుతూ స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.
ప్రశాంతంగా రోడ్డు పై నడుస్తున్నా బాట సారులపై వెంటబడి దాడులు చేస్తున్నాయి. వీధి కుక్కలను చూస్తే.. పట్టణ ప్రజలకు వణుకు పుడుతుంది. ఒంటరిగా వెళ్తే దాడి చేసి గాయపరుస్తుండడంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. శునకాల స్వైర విహారంతో పట్టణ ప్రజలు బేంబేలెత్తిపోతున్నారు. మున్సిపాలిటీలో రోజు రోజుకి వీధి కుక్కలు పెరిగి దాడులకు పాల్పడుతుంటడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులను పాఠశాలలకు, ట్యూషన్ లకు పంపాలంటే తల్లితండ్రులు జంకుతున్నారు. విద్యా నగర్, తిలక్ నగర్, సుభాష్ నగర్, ఇందిరా నగర్, బలరాం నగర్ , కుర్మిద్దా రోడ్ ఇలా పట్టణంలో అన్ని కాలనీలలో కుక్కలు పదుల సంఖ్యలో సంచరిస్తూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వారిని కుక్కలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు వీధి కుక్కల బెడద ఎక్కువవ్వడంతో భయాందోనళకు గురవుతున్నారు. కాలనీల్లో పాదచారులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లాలంటే వెంబడిస్తున్నాయి. 10 రోజుల క్రిందట విద్యానగర్ లో ఒక పిచ్చి కుక్క స్వైర విహారంతో 5 మందిని తీవ్రంగా గాయపరిచింది. 4 రోజుల క్రిందట రోడ్డున పోయే ఓ మహిళను వెంబడించి కాటు వేయడానికి ప్రయత్నించింది. ఇలాంటి ఘటనలు తరుచు జరుగుతున్న కుక్కల నివారణ చర్యలు చేపట్టకపోవడంతో మున్సిపాలిటి లో వందల సంఖ్యలో కుక్కలు సంచరిస్తున్నాయి. చీకటి పడితే రోడ్డు పై రావాలంటే భయంగా ఉందని, వీధి కుక్కల భారి నుంచి కాపాడాలంటూ పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కుక్కల బెడద అధికంగా కావడం పురపాలక జనాలంతా భయం భయంగా తిరగవలసిన దుస్థితి నెలకొంది. శునకాల నియంత్రణకు మున్సిపాలిటీలో ఒక నిర్దిష్టమైన కార్యక్రమం తీసుకోకపోవడం వల్లనే అవి అంతకంతకు పెరిగిపోతున్నాయని పట్టణవాసులు మండిపడుతున్నారు. మనుషులు ఏమీ అననంత వరకు అవి మనకు ఎలాంటి హానీ చేయవని తెలిసిన ఏ సమయంలో వచ్చి దాడులు చేస్తాయోయని భయపడుతున్నారు. కుక్కలు కాటు వల్ల రేబీస్ వ్యాధి సోకుతుందని పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పుర వీధుల్లోని రోడ్లపై కుక్కలు స్వైర విహారం చేస్తూ ఎక్కడ చూసిన గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. నడుచుకుంటూ వెళ్తున్న వారిపై విరుచుకుపడుతున్నాయి. కల్వకుర్తి లో ఇలా రోజుకో కుక్క కాటుతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రేబిస్ సోకిన కుక్కలు దాడులు చేస్తూ ప్రజల ప్రాణాల మీదకు తీసుకువస్తున్నాయ. కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు తీసుకోవాలని, అవి కరిస్తే చనిపోతున్నారంటూ చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. వీటి సంతతి పెరగకుండా చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ అధికారులు ఈ సంగతే మరిచారు. జనంపై పడి విచక్షణారహితంగా కరిచే పిచ్చి కుక్కలను పట్టి దూరంగా వదిలి బాధ్యత మున్సిపాలిటిది. ఈ విషయంలో అలసత్వం ఎందుకు వహిస్తున్నారని, కుక్కలు కరిస్తే వెంటనే మరణించకపోయినా తద్వారా వ్యాపించే రేబీస్ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశముందని పట్టణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కల్వకుర్తి లోని వీధి కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ అధికార యంత్రాంగం, వార్డు కౌన్సిలర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుకాణ, ఇంటి టాక్స్, నల్లా టాక్స్ ల పైన ఉన్నా శ్రద్ధ పురప్రజల మీద చూపడంలేదని గగ్గోలుపెడుతున్నారు. పురపాలక అధికారులు తక్షణమే స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని, వీధి కుక్కలను పట్టి టీకాలు వేయించాలని, రోగగ్రస్తమైన కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.






