ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్

by Kodari Anjali |

జాతీయ రహదారులు, బైపాస్ రోడ్ల పై ప్రమాదాల నివారణకు చేపట్టిన రోడ్డు భద్రతా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: జిల్లాలో జాతీయ రహదారులు, బైపాస్ రోడ్ల పై ప్రమాదాల నివారణకు చేపట్టిన రోడ్డు భద్రతా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ (డీఆర్‌సీ) సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి తో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు స్థితిని పరిశీలించిన కలెక్టర్, జడ్చర్ల మండలం గంగాపూర్ సమీపంలోని ఎన్‌హెచ్-167 పై డివైడర్ నిర్మాణం, రంబుల్ స్ట్రిప్‌ల ఏర్పాటుపై వివరాలు అడిగారు. స్నేహా పోల్ట్రీ సమీపంలో రంబుల్ స్ట్రిప్‌లు ఏర్పాటు చేసినట్లు, డివైడర్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాల్సి ఉందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. అమిస్తాపూర్ వద్ద ఎన్‌హెచ్-167 విస్తరణకు అడ్డుగా ఉన్న శ్మశానవాటిక తరలింపు అంశంపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుని త్వరలోనే తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. కొయిల్‌ కొండ జంక్షన్ సమీపంలో రంబుల్ స్ట్రిప్‌ల ఏర్పాటు ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు.

ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు...

మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలో ప్రతిపాదించిన రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించిన డీపీఆర్‌ను రెండు నెలల క్రితమే ఉన్నతాధికారులకు పంపినా అనుమతులు రాకపోవడంపై వెంటనే ఫాలో అప్ చేసి అనుమతులు పొందాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని అశోక్ టాకీస్ వద్ద మీడియన్ ఏర్పాటు ప్రతిపాదనపై స్థానిక ఎమ్మెల్యే, ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. ఎన్‌హెచ్-44 పై పెద్దాయిపల్లి, రంగారెడ్డిగూడెం, పోలేపల్లి, మాచారం జంక్షన్లలో ప్రమాద నివారణ చర్యలు ప్రారంభమైనట్లు, పెద్దాయిపల్లి జంక్షన్ వద్ద అదనపు లైటింగ్ పనులను జూలై 15 లోగా పూర్తి చేస్తామని తెలిపారు. బాలానగర్, రాజాపూర్ జంక్షన్ వద్ద వై-ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించగా, ముదిరెడ్డిపల్లి వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

ఫ్లైఓవర్ పనులను సమీక్షించిన కలెక్టర్...

రాయికల్ టోల్ ప్లాజా నుంచి అడ్డాకల్ వరకు ఎన్‌హెచ్-44 పై అన్ని మీడియన్ ఓపెనింగ్‌ల వద్ద సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మూసాపేట్ జంక్షన్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ జానకి పేర్కొనగా, అక్కడ రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులు, అదనపు బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. బూరెడ్డిపల్లి వద్ద, దివిటిపల్లి-తాడిపత్రి మార్గంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను సమీక్షించిన కలెక్టర్, హైదరాబాద్ వైపు రహదారి పనులు పూర్తయ్యాయని, కర్నూలు వైపు పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. త్వరలోనే ట్రాఫిక్‌ ను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని తెలిపారు. భూత్పూర్ ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద పాదచారుల భద్రత కోసం సైన్‌ బోర్డులు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉడిపి హోటల్ సమీపంలో రంబుల్ స్ట్రిప్‌ల ఏర్పాటు పూర్తయిందని అధికారులు తెలిపారు.

పొన్నకల్ జంక్షన్ వద్ద ప్రమాదకర మలుపు కారణంగా...

జడ్చర్ల ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ సమస్యపై చర్చించిన కలెక్టర్, మహబూబ్‌నగర్ వైపు రహదారి విస్తరణ అవకాశాలను పరిశీలించాలని, పోలీసు శాఖతో కలిసి సంయుక్త తనిఖీ నిర్వహించి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. అలాగే పొన్నకల్ జంక్షన్ వద్ద ప్రమాదకర మలుపు కారణంగా అదనపు రంబుల్ స్ట్రిప్‌ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పిస్తా హౌస్, ఎదిర, పాలకొండ రోడ్డు జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్‌లు, బ్యారికేడ్ల పనులు పూర్తయ్యాయని ఆర్‌ అండ్‌ బీ అధికారులు తెలిపారు. బైపాస్ రోడ్డులోని మీడియన్ క్రాసింగ్‌ల వద్ద త్వరలో సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్‌ అండ్‌ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంధ్య, పీఆర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామాంజులు రెడ్డి, ఎన్‌హెచ్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, రోడ్డు భద్రత నిపుణులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story