ఓటర్ల జాబితా సవరణకు రాజకీయ పార్టీలు సహకరించాలి

by velandi.Saikiran |

ఓటర్ల జాబితా ప్రక్షాళన విజయవంతం అయ్యేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు.

ఓటర్ల జాబితా సవరణకు రాజకీయ పార్టీలు సహకరించాలి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బీఎల్ఓ లతో సమన్వయం చేసుకుంటూ, ఓటర్ల జాబితా ప్రక్షాళన విజయవంతం అయ్యేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)' పై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ మాట్లాడారు. బూత్ లెవెల్ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి సన్నాహక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు బీఎల్ఓ లు ప్రతి ఇంటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి వివరాలను సేకరిస్తారని, 2002 ఓటర్ల జాబితా ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలను ఇందులో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

జూలై 24 నుండి 30 వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1200 మంది ఓటర్లు ఉండేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడతారని తెలిపారు. ఓటర్ల ముసాయిదా జులై 31 న జాబితా ప్రచురించి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం అక్టోబర్ 1 న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారని అన్నారు. వలస వెళ్లినవారు, మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లను గుర్తించి జాబితా నుండి తొలగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 లోని సెక్షన్ 31 ప్రకారం, ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం లేదా తప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష, జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉందని తెలిపారు.

ప్రస్తుత జాబితాలో పేరు లేని కొత్త ఓటర్లు తప్పనిసరిగా ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రచూరణ 2026 అక్టోబర్ 1 నాటికి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆమె వెల్లడించారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారిన వారు ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జెఎల్ బి హరిప్రియ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, సాయిబాబా (ఐఎన్సీ), యాదసత్యం(బీఆర్ఎస్),రాజేందర్ రెడ్డి(బిజెపి), అబ్దుల్ హాది, సాదతుల్ల,(ఎంఐఎం), సామ్యూల్(వైఎస్ఆర్సీపీ),నర్సింహులు (బిఎస్పీ), మురళి(టిడిపి), తదితరులు పాల్గొన్నారు.

Next Story