- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కక్షపూరితంగా షెడ్డుల తొలగింపు.. బాధితుల ఆవేదన
మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 721లో ప్రభుత్వ భూమిలో జీవనోపాధి కోసం సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్న షెడ్డులను రెవెన్యూ అధికారులు కక్షపూరితంగా తొలగించారని బాధితులు సంగణమౌని రామకృష్ణ, వెంకటయ్యలు ఆరోపించారు.

దిశ, వీపనగండ్ల : మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 721లో ప్రభుత్వ భూమిలో జీవనోపాధి కోసం సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్న షెడ్డులను రెవెన్యూ అధికారులు కక్షపూరితంగా తొలగించారని బాధితులు సంగణమౌని రామకృష్ణ, వెంకటయ్యలు ఆరోపించారు. అగ్రకులాల పెద్దల మాటలకు లోబడుతూ తమపై మాత్రమే చర్యలు తీసుకోవడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 721లో మొత్తం 16 ఎకరాలు 20 కుంటల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఈ భూమిలో ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు, గ్రామానికి చెందిన బీసీలు, అగ్రకులాలకు చెందిన కొందరు వ్యక్తులు షెడ్లు డబ్బాలు మరియు ఇండ్లు నిర్మించుకోవడం, మరికొందరు హద్దులు ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము తహశీల్దార్ వరలక్ష్మికి పలుమార్లు వివరించామని చెప్పారు. అయితే అధికారులు అందరిపై సమానంగా చర్యలు తీసుకోకుండా, తమకు మాత్రమే నోటీసులు జారీ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
“ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న వారికి, స్థలాలు కబ్జా చేసుకున్న వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, మాకు మాత్రమే నోటీసులు ఇచ్చి వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని చెప్పారు. కానీ నోటీసు ఇచ్చి మేము ఇంటి దగ్గర లేని సమయంలో రెండవ రోజే రెవెన్యూ, అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి మా షెడ్డును కూల్చివేయడం సరైన విధానం కాదు” అని వారు అన్నారు. గ్రామంలోని పలువురు ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పటికీ, ఆ విషయాలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యంగా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంగిరెడ్డి తన పొలానికి సమీపంలోని బీమా కాలువ భూమిని ఆక్రమించి హద్దులు ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఆ విషయంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు పక్షపాత ధోరణి విడనాడి, ప్రభుత్వ భూమిలో జరిగిన అన్ని ఆక్రమణలపై సమానంగా చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అధికారులు తొలగించిన చోట మళ్లీ షెడ్ నిర్మించుకుంటామని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని, ఒక వర్గాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని గ్రామస్తులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






