పోలీస్ స్టేషన్ ముందే మృత్యువు.. ‘దిశ’ కథనంతో దిగివచ్చిన అధికారులు

by Ratna Kumari |

మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ముందున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రాణసంకటంగా మారిందంటూ 'దిశ' పత్రికలో ప్రచురితమైన "మృత్యు కుహరంలో రూరల్ పీఎస్ ముందరి ట్రాన్స్‌ఫార్మర్" వార్త అధికారుల్లో కదలిక తెచ్చింది.

పోలీస్ స్టేషన్ ముందే మృత్యువు.. ‘దిశ’ కథనంతో దిగివచ్చిన అధికారులు
X

దిశ -మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ముందున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రాణసంకటంగా మారిందంటూ 'దిశ' పత్రికలో ప్రచురితమైన "మృత్యు కుహరంలో రూరల్ పీఎస్ ముందరి ట్రాన్స్‌ఫార్మర్" వార్త అధికారుల్లో కదలిక తెచ్చింది. వార్త ప్రచురితమైన వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు, సదరు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీస్ శాఖకు నోటీసులు జారీ చేశారు. ప్రమాదకరంగా ఉన్న ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు ఈ సందర్భంగా ప్రకటించారు. గతంలో ఆరు అడుగుల ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పునాది, పోలీస్ స్టేషన్ సిబ్బంది చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల మట్టితో పూడుకుపోయి ఎత్తు తగ్గిందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ట్రాన్స్‌ఫార్మర్ తరలింపునకు అయ్యే సివిల్ పనుల ఖర్చులను పోలీస్ శాఖే భరించాలని విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం నోటీసులో స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ తన బాధ్యతగా షిఫ్టింగ్‌కు సిద్ధమని నోటీసు ఇవ్వడంతో, ఇప్పుడు బంతి పోలీస్ శాఖ కోర్టులో పడింది. మరి నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్ ముందున్న ఈ మృత్యుపాశాన్ని తొలగించేందుకు పోలీస్ శాఖ నిధులు వెచ్చించి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Next Story