అచ్చంపేట‌లో గాలివాన బీభ‌త్సం

by Ratna Kumari |

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో గురువారం సాయంత్రం తర్వాత అకాల వర్షం కురిసి గాలివాన బీభత్సం సృష్టించింది.

అచ్చంపేట‌లో గాలివాన బీభ‌త్సం
X

దిశ, ​అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో గురువారం సాయంత్రం తర్వాత అకాల వర్షం కురిసి గాలివాన బీభత్సం సృష్టించింది. వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు, రవాణా ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ లో నిల్వ ఉంచిన మొక్కజొన్న పూర్తిగా తడిసి ముద్దయింది. ప్రధాన కారణం మార్కెట్ కమిటీ అధికారుల నిర్లక్ష్యం, రవాణా కాంట్రాక్టర్ల ఉదాసీనత వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్ మునిగింది.. ధాన్యం తడిసింది..!

మార్కెట్ యార్డులో ఓపెన్ ప్లాట్‌ఫారాలపై ఉన్న వేలాది క్వింటాళ్ల ధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దయింది. సరైన తార్పాలిన్లు (కవర్లు) అందుబాటులో లేకపోవడం, ఎగుమతి వేగంగా జరగకపోవడంతో రైతులు కళ్లముందే తమ పంట నీటిపాలు కావడం చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. తడిసిన ధాన్యానికి రంగు మారి, మొలకలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.

​వందల లారీల ధాన్యం..

​ప్రస్తుతం అచ్చంపేట మార్కెట్ యార్డులో దాదాపు 125 లారీలకు సరిపడా భారీ మొత్తంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి ఉన్నాయి. రోజురోజుకూ రైతులు తెస్తున్న ధాన్యంతో మార్కెట్ లో ఎటు చూసినా ధాన్యపు గింజలే కుప్పలుగా పోసి రైతులు అమ్మకాలు చేసేందుకు దాదాపు 20 రోజులకు పైగా నిరీక్షణ చేస్తూనే ఉన్నారు. పెద్ద మొత్తంలో ధాన్యం ఉన్నప్పటికీ, ఇక్కడి నుండి కేవలం రోజుకు రెండు మూడు లారీలలో మాత్రమే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. "వంద లారీల ధాన్యం పెట్టుకుని రోజుకు రెండు లారీలు తీస్తే, మార్కెట్ ఖాళీ అవ్వడానికి నెల రోజులు పడుతుంది. అప్పటివరకు మా పరిస్థితి ఏంటి? మళ్లీ వర్షం వస్తే మాకు దిక్కెవరు?" అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం వేగంగా ధాన్యాన్ని గోదాములకు తరలించే చర్యలు చేపట్టకపోతే రైతన్నలు పూర్తిగా నష్టపోయి ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చిపోయే ఇదిగో అదిగో అని మాటలు చెప్పడం మానేసి వేగవంతంగా ధాన్యాన్ని తరలించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు రైతులు.

Next Story