మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ చైర్మన్‌పై అవినీతి ఆరోపణలు

by Ratna Kumari |

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ లక్ష్యంగా వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై విచారణ వేగవంతమైంది.

మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ చైర్మన్‌పై అవినీతి ఆరోపణలు
X

దిశ, మహబూబ్ నగర్ : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ లక్ష్యంగా వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై విచారణ వేగవంతమైంది. 'నేను సైతం'స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి దిడ్డి ప్రవీణ్ కుమార్ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు, ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో విచారణ చేపట్టిన కమిటీ సభ్యులు,కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రక్త సేకరణ, అకౌంట్లకు సంబంధించిన కీలక పత్రాలు కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంపై కమిటీ సభ్యులు అగ్రహాం వ్యక్తం చేశారు. స్టేట్ కమిటీ ఎప్పుడో రద్దు అయినప్పటికీ,జిల్లా చైర్మన్ గా ఇంకా ఏ ప్రాతిపదికన కొనసాగుతున్నారని కమిటీ సభ్యులు నటరాజ్‌ను నిలదీశారు. జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని చైర్మన్ నటరాజ్, వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్‌లను కోశాధికారి జగపతి రావును కమిటీ ఆదేశించింది. అవకతవకలకు సంబంధించి పూర్తి వివరాలు, రికార్డులను సమర్పించడానికి కమిటీ 15 రోజుల గడువు విధించింది. పూర్తి వివరాలను సేకరించి నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు సమాచారం. గత కొంత‌ కాలంగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రెడ్ క్రాస్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

Next Story