- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి సహకరించాలి : అదనపు కలెక్టర్ మధుమోహన్
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. బుధవారం ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినందున రాజకీయ పార్టీల నేతలు తమ వంతుగా సహాయ, సహకారాలు అందించాలని కోరారు.
మృతి చెందిన ఓటర్లను, బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగించడమే కాక అర్హులైన ఓటర్లందరూ ఎలక్ట్రోరోల్ ఓటరు జాబితాలో ఉండేలా ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడం జరుగుతోందన్నారు. ఎస్ఐఆర్ పై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు తమ వంతుగా సహకారం అందించాలన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు తమ పరిధిలోని ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 01 తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్టు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారి మంజుల, గద్వాల తహశీల్దార్ హరికృష్ణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.






