అనిరుధ్ రెడ్డి-ల‌క్ష్మారెడ్డి రాజ‌కీయ ర‌గ‌డ‌కు రాజాపూర్ లో కూల్ బ్రేక్

by Nallavelli.Anjaneyulu |

జడ్చర్ల నియోజకవర్గ రాజకీయాల్లో గత కొంతకాలంగా వేడెక్కిన వాతావరణం కూల్ కావడానికి శుక్రవారం రాజాపూర్ మండల కేంద్రం వేదికైంది.

అనిరుధ్ రెడ్డి-ల‌క్ష్మారెడ్డి రాజ‌కీయ ర‌గ‌డ‌కు రాజాపూర్ లో కూల్ బ్రేక్
X

దిశ, నవాబుపేట/రాజాపూర్ : జడ్చర్ల నియోజకవర్గ రాజకీయాల్లో గత కొంతకాలంగా వేడెక్కిన వాతావరణం కూల్ కావడానికి శుక్రవారం రాజాపూర్ మండల కేంద్రం వేదికైంది. ఒకరిపై ఒకరు తీవ్ర సవాళ్లు విసురుకుంటూ, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ దుమారం రేపిన జడ్చర్ల సెట్టింగ్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డిలు ఒకే కార్యక్రమంలో పాల్గొని వేదికపై ప‌క్క ప‌క్క‌నే కూర్చుని సరదాగా సంభాషించుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. అలాగే వాలీబాల్ క్రీడలను ఆ ఇద్దరు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. ఎన్నికల సమయంలోనే కాదు, ఎన్నికల అనంతరం కూడా పలు సందర్భాల్లో “నువ్వెంతంటే నువ్వెంత”, “నీ సంగతి చూస్తాను అంటే నీ సంగతి చూస్తాను” అంటూ పరస్పరం సవాళ్లు విసురుకుని నియోజకవర్గ రాజకీయాల్లో వేడి పెంచిన ఈ ఇద్దరు నేతలు, కొన్నిసార్లు శృతిమించిన వ్యాఖ్యలతో జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలను కూడా అయోమయానికి గురిచేశారు. వారి మాటలు సవాళ్లు సవాళ్లు శృతిమించడంతో ఎప్పుడు ఎలాంటి దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొన్న సందర్భాలూ ఉన్నాయి.


ఆ వేడి రాజకీయాలకు విరామమిస్తూ శుక్రవారం రాజాపూర్‌లో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ వాలీబాల్ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇద్దరూ హాజరయ్యారు. ముందుగా ఒకరిని ఒకరు చిరునవ్వుతో పలకరించుకోవడం, అనంతరం ఒకే వేదికపై పక్కపక్కన కూర్చొని ఆత్మీయంగా సంభాషించుకోవడం సభలో చర్చనీయాంశమైంది. క్రీడా పోటీలను సంయుక్తంగా ప్రారంభించడం ద్వారా “రాజకీయాలు వేరే… ప్రజా కార్యక్రమాలు వేరే” అనే సందేశాన్ని ఇద్దరూ ఇచ్చారనే అభిప్రాయం స్థానిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. క్రీడా మైదానంలో వీరి కలయికను చూసిన కార్యకర్తలు, ప్రజలు కొంతసేపు ఆశ్చర్యపోయినా, అనంతరం చప్పట్లతో స్వాగతించారు. ఇప్పటివరకు పరస్పర విమర్శలతో వార్తల్లో నిలిచిన ఈ ఇద్దరు నేతలు, ఇప్పుడు ఒకే వేదికపై కలిసివచ్చి రాజకీయాలకు మించిన ప్రజా సంబంధాల ప్రాధాన్యాన్ని చాటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జడ్చర్ల రాజకీయాల్లో ఇది కొత్త అధ్యాయానికి నాంది కాదా? లేక క్రీడా వేదిక వరకే పరిమితమా? అన్నది కాలమే నిర్ణయించాలి. రాజకీయ వేడి నుంచి క్రీడా కూల్‌నెస్‌ వరకు సాగిన ఈ పరిణామం ప్రస్తుతం జడ్చర్లలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story