- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన వేళ మిడ్జిల్‌లో విగ్రహాల వివాదం..
మిడ్జిల్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ స్థల వివాదం తీవ్రం.. సీఎం పర్యటన వేళ విగ్రహాల ఏర్పాటుపై రాజకీయం.. పేదల డబ్బాల తొలగింపుపై ఉత్కంఠ!

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గ పరిధిలోని మిడ్జిల్ మండల కేంద్రంలో విద్యుత్ సబ్‌స్టేషన్ స్థల వివాదం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు ఈ స్థలం కేంద్ర బిందువుగా మారింది. సీఎం పర్యటనకు ముందే ఇరుపక్షాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తుండటంతో మండలంలో కోల్డ్ వార్ కాస్తా హైఓల్టేజీ రాజకీయంగా మారుతోంది. 1982 నాటి భూకేటాయింపుల నుంచి మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు విగ్రహాల ఏర్పాటు, పేదల డబ్బాల తొలగింపు ఆదేశాల వరకు వచ్చి చేరింది.
రూటు మార్చిన అదనపు భూమి!
1982వ సంవత్సరంలో బుచ్చారెడ్డి అనే భూస్వామి పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల కోసం తన సొంత స్థలాన్ని ఉచితంగా, మరికొంత విక్రయం ద్వారాను కేటాయించారు. ఇందులో భాగంగానే 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం 3 ఎకరాల భూమిని ఇచ్చారు. అయితే సబ్‌స్టేషన్ పరిధి దాటి తనకు అదనపు స్థలం ఉందని, దానిని గుర్తించాలని అప్పట్లో ఆయన విద్యుత్, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో (2019లో) సదరు భూమిని సర్వే చేయగా అదనపు స్థలం ఉన్నట్లు తేలింది. దీన్ని ఆసరాగా చేసుకుని అప్పటి అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు ఆ స్థలాన్ని తమ పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, మిగిలిన స్థలంలో దాదాపు 50 కి పైగా స్థానిక పేద కుటుంబాలు చిన్న చిన్న డబ్బాలు వేసుకుని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నాయి.
సీఎం పర్యటన వేళ విగ్రహాలు ఏర్పాటు చేయాలని..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే నెల (జూలై)లో మిడ్జిల్ మండలంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగానే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు సీఎం స్థాయికి ఎదిగినందున, ఈ పర్యటనను అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే సబ్‌స్టేషన్ పక్కన ఉన్న వివాదాస్పద స్థలంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం తో పాటు, మాజీ జెడ్పీ చైర్మన్ డి. గోపాల్‌రెడ్డి విగ్రహాన్ని నెలకొల్పి, సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహరచన చేశారు.
ఖాళీ చేసే ప్రసక్తే లేదు: బాధితుల హెచ్చరిక
విగ్రహాల ఏర్పాటు కోసం అక్కడ ఉన్న పేదల డబ్బాలను తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. స్థల అసలు యజమానులు, వారి నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో పాటు దశాబ్దాలుగా ఉపాధి పొందుతున్న డబ్బాల నిర్వాహకులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బాలను ఖాళీ చేయబోమని, ఇక్కడ విగ్రహాల ఏర్పాటును అడ్డుకుంటామని భీష్మించుకు కూర్చున్నారు. వీరికి ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం మద్దతుగా నిలుస్తుండటంతో వ్యవహారం కాస్తా ‘అధికార వర్సెస్ ప్రతిపక్షం గా మారింది.
ఉన్నతాధికారుల చేతిలో..
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో అప్రమత్తమైన రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు సబ్‌స్టేషన్ భూమికి సంబంధించిన తొలి కేటాయింపులు, 2019 నాటి సర్వే వివరాలు, రిజిస్ట్రేషన్ల రికార్డులను అత్యవసరంగా సేకరించారు. వీటన్నింటిపై సమగ్ర నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో సీఎం రాకను పురస్కరించుకుని అధికారులు ఈలోపే వివాదాన్ని సామరస్యంగా పరిష్కరిస్తారా? లేక రాజకీయ సెగలు మరింత రాజుకుంటాయా? అనేది ఇప్పుడు మండలంలో ఉత్కంఠ రేపుతోంది.






