ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం శుభ‌ పరిణామం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

by Ratna Kumari |

దిశ‌, కంద‌నూల్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటం రాష్ట్రానికి శుభ‌ పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం శుభ‌ పరిణామం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
X

దిశ‌, కంద‌నూల్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటం రాష్ట్రానికి శుభ‌ పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల ఫలితాలపై వస్తున్న ఎగ్జిట్ పోల్స్ స్వాగతించదగినవని అన్నారు. బీజేపీ, దానికి మద్దతిస్తున్న బీఆర్ఎస్ పార్టీలు గెలవకూడదని, ఇది రాష్ట్రానికి ఎంతో మేలు అన్నారు. బీజేపీ ఎదగడం దేశానికి చేటన్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయేకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావడం విచారకరమన్నారు. దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాలేకున్నా అధికార ప్రభుత్వాలకు ప్రభావితం చేయగల సత్తా కమ్యూనిస్టు పార్టీకి ఉన్నదన్నారు. అధికార పక్షానికి మద్దతిచ్చినా మంచి చేస్తే మంచి అంటామని, ప్రజా వ్యతిరేక చర్యలపై ఉద్యమిస్తామన్నారు. సీపీఐ ఎల్లపుడూ ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో డిసెంబర్ 26న నిర్వహించనున్న బహిరంగ సభ తర్వాత రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామన్నారు.


హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం లక్షల మందితో తెలంగాణ దిగ్బంధం చేస్తామన్నారు. ఆరెస్సెస్ వారి స్వార్థం కోసం, దేశాన్ని హిందూ దేశంగా ఏర్పాటు చేసేందుకు పుట్టిన సంస్థ అని అందు కోసమే సంఘ్ పరివార్, బీజేపీని తయారు చేసిందన్నారు. సీపీఐ ప్రజల కోసమే పుట్టిన పార్టీ అని వెల్లడించారు. సోషలిజం, పెట్టుబడి దారీ వ్యవస్థ పరస్పరం విరుద్ధమైనవన్నారు. ఆరెస్సెస్, సంఘ్ పరివార్, బీజేపీ ఆగడాలను అరికట్టేందుకు దేశంలోని అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందన్నారు. డిసెంబర్ 26న ఖమ్మం బహిరంగ సభ విజయవంతం చేసేందుకు 17న గద్వాల, జోడెఘాట్, బాసర నుంచి జాతాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.బాల నరసింహ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పేదలకు అన్యాయం జరిగిందని, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలు చొప్పించి అనర్హులకు ఇచ్చారన్నారు. చాల మంది రైతులకు వడ్లకు 500 రూపాయలు బోనస్ రాలేదన్నారు. అకాల వర్షాలకు పత్తి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story