గద్వాల చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకొన్న కాంగ్రెస్ పార్టీ

by Bhoopathi Nagaiah |

గద్వాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌కే అధికారం దక్కింది.

గద్వాల చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకొన్న కాంగ్రెస్ పార్టీ
X

దిశ, జోగులాంబ ప్రతినిధి : గద్వాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాస విజయాన్ని నమోదు చేసింది. సోమవారం గద్వాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నికల అధికారి నరసింగరావు అధ్యక్షతన జరిగింది. చైర్మన్ పదవికి అవసరమైన మెజారిటీ 19 ఓట్లు కాగా, కాంగ్రెస్ పార్టీకి 20 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక ఎంఐఎం సభ్యులు మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటించారు. అదనంగా ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా ఎంపీ మల్లు రవి తన ఓటు హక్కును వినియోగించుకోవడంతో కాంగ్రెస్ మెజారిటీని దాటింది.

బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా..

ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేస్తామని ముందుగా ప్రకటించినప్పటికీ, చివరకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మాత్రమే అభ్యర్థులు పోటీ చేశారు. చైర్మన్‌గా అనిత నరసింహ, వైస్ చైర్మన్‌గా వెంకటేష్ ను ప్రకటించగా వారికి కేవలం 11 ఓట్లు మాత్రమే లభించాయి. బీజేపీ సభ్యులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా హాల్‌ను వీడి వెళ్లిపోయారు. ఎన్నికల అధికారి నర్సింగరావు అధికారికంగా చైర్ పర్సన్‌గా తుమ్మల జయలక్ష్మి నరసింహ, వైస్ చైర్మన్‌గా శంకర్ ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ఇద్దరూ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు ఇది కీలక రాజకీయ విజయంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఓటింగ్‌కు దూరంగా ఎమ్మెల్యే బండ్ల

మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మొహన్ రెడ్డి పై విప్ అధికారంతో ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నం చేసినా ఆయన అత్యంత వ్యూహంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు దూరంగా ఉండి తన ఎక్స్ అఫీషీయో ఓటును వినియోగించుకోలేదు.

Next Story