అనూహ్యంగా అమరచింత మున్సిపాలిటీపై ఎగిరిన కాంగ్రెస్ జెండా

by Bhoopathi Nagaiah |

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు క్యాంప్ రాజకీయాలు చేసినా హంగ్ ఏర్పడ్డ అమరచింత మున్సిపాలిటీలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది.

అనూహ్యంగా అమరచింత మున్సిపాలిటీపై ఎగిరిన కాంగ్రెస్ జెండా
X

దిశ,అమరచింత: వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఈ నెల 13న ఎన్నికల ఫలితాలు రావడంతో గెలుపొందిన అభ్యర్థులను, ఆయా పార్టీల నాయకులు శిబిరాలకు తరలించారు. గత మూడు రోజులుగా శిబిరాల్లో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చర్చించుకున్నపటికీ చైర్మన్ అభ్యర్థి ఎవరు అనే నిర్ణయానికి రాకపోవడంతో కొంత సందిగ్ధం ఏర్పడింది. ఇదే అదునుగా చూసుకున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులతో టచ్‌లో ఉండి, 2వ వార్డు అభ్యర్థికి చైర్ పర్సన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థితో కలిపి 5 మంది అభ్యర్థులు కాంగ్రెస్ వైపు ఉన్నారు.10 వార్డుల్లో 5 వార్డులు కాంగ్రెస్‌కు వచ్చాయి. దీంతో పాటు ఎక్స్ అఫిషియో ఓటును స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి వినియోగించుకున్నారు. ఆయన ఓటుతో కాంగ్రెస్‌కు పూర్తి స్థాయి మెజార్టీ సంఖ్య ఆరుకు చేరుకోవడడంతో జింక సువర్ణను చైర్ పర్సన్‌గా, వైస్ చైర్ పర్సన్‌గా జీ.రాధను ఎన్నుకున్నారు. దీంతో మున్సిపాలిటీ పీఠం అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

గత మూడు రోజులుగా కొనసాగుతున్న చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికకు ముందు బీఆర్ఎస్ వర్గాలు చైర్ పర్సన్ భర్త జింక రవితో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లడం పట్ల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి, ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీస్‌లు రంగంలోకి దిగి చైర్ పర్సన్ భర్త జింక రవిని ప్రొటక్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులను శాంతింపజేశారు.

Next Story