ముంపు బాధితుల‌కు అండ‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వం : సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు స‌త్య‌శీలరెడ్డి

by Nallavelli.Anjaneyulu |

ఏళ్ల తరబడి సర్వం కోల్పోయి ముంపు బాధితుల కన్నీటి గాథలను గత పాలకులు పట్టించుకోకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాల్లో కొత్త ఆశల వెలుగులు నింపుతోందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యశీలా రెడ్డి అన్నారు.

ముంపు బాధితుల‌కు అండ‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వం : సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు స‌త్య‌శీలరెడ్డి
X

దిశ‌, రేవ‌ల్లి : ఏళ్ల తరబడి సర్వం కోల్పోయి ముంపు బాధితుల కన్నీటి గాథలను గత పాలకులు పట్టించుకోకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాల్లో కొత్త ఆశల వెలుగులు నింపుతోందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యశీలా రెడ్డి అన్నారు. బుధవారం ముంపు గ్రామమైన బండరాయిపాకులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాది మాటల మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముంపు బాధితుల వెతలను తీర్చేందుకు ఎమ్మెల్యే మేఘా రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. గత పాలకుల హయాంలో ముంపు బాధితుల గోడు వినిపించుకోకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కార మార్గాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా ఆర్ అండ్ ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) కమిటీకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, కమిటీ తీర్మానాలు, సూచనలు, సలహాల మేరకు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తోందని తెలిపారు. గ్రామస్తులు తమ సమస్యలను, ముంపు బాధితుల ఇబ్బందులను ఆర్ అండ్ ఆర్ కమిటీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని సూచించారు.


ముంపు గ్రామమైన బండరాయిపాకుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వెల్లడించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కోసం రూ.1 కోటి 21 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో గ్రామ రూపురేఖలు మారనున్నాయని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఆర్ అండ్ ఆర్ కమిటీ సూచనలు, తీర్మానాల మేరకు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సత్యశీలా రెడ్డి స్పష్టం చేశారు. ముంపు బాధితుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం, సేవలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి నిరాశలో మగ్గిన ముంపు బాధితుల జీవితాల్లో ఆశాకిరణాలు నింపుతూ, అభివృద్ధి ఫలాలు వారి గడప దాకా చేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే మేఘా రెడ్డి చేపడుతున్న చర్యలు గ్రామ ప్రజల్లో కొత్త నమ్మకాన్ని, భవిష్యత్తుపై కొత్త ఆశలను కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో మండలం పార్టీ అధ్యక్షుడు సుల్తాన్ అలీ, సింగిల్ విండో అధ్యక్షుడు రఘు, సర్పంచులు రాజు, రాజయ్య,నీలమ్మ శ్రీశైలం, మార్కెట్ కమిటీ సభ్యులు సిరిమల్లేష్, తిరుపతయ్య, నాయకులు బాల్ రెడ్డి, పర్వతాలు, మిద్దె స్వామి, తెప్ప మహేశ్వరం, బాలస్వామి పాల్గొన్నారు.

Next Story