జాతీయ రహదారులపై పెండింగ్ పనులు పూర్తి చేయండి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా

by Ratna Kumari |

జిల్లాలోని జాతీయ రహదారులపై పెండింగ్‌లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి, రోడ్డు ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.

జాతీయ రహదారులపై పెండింగ్ పనులు పూర్తి చేయండి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లాలోని జాతీయ రహదారులపై పెండింగ్‌లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి, రోడ్డు ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ లో శనివారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సైన్‌ బోర్డులు, బ్యారికేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రహదారులపైన రోడ్డు మరమ్మతులు, నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేసి, వాహన రాకపోకలు అంతరాయం లేకుండా చూడాలని పోలీస్ శాఖ కు సూచించారు. బాలానగర్ ఫ్లై ఓవర్ పనులను మే నెలాఖరులోపు పూర్తి చేయాలని, పెద్దయ్యపల్లి ఎక్స్‌రోడ్స్ వద్ద సైన్‌బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్ వంటి పెండింగ్ పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. జడ్చర్ల-కల్వకుర్తి రైల్వే బ్రిడ్జ్ సమీపంలోని పెండింగ్ సైన్‌బోర్డు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించగా, ఒక నెలలో పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.


అడ్డాకల్ సర్వీస్ రోడ్ వద్ద లైటింగ్, పొన్నకల్ జంక్షన్ వద్ద హైమాస్ట్ లైట్స్, అవసరమైన స్పీడ్ బ్రేకర్లు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని సూచించారు. జడ్చర్ల-గంగాపూర్ మధ్య డివైడర్ పనుల విషయంలో తాత్కాలికంగా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అమిస్తాపూర్ శ్మశాన వాటిక ప్రాంతంలో, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, స్నేహా పోల్ట్రీ ఫారం సమీపంలోని పెండింగ్ పనులను వచ్చేనెల రోడ్డు భద్రత సమావేశం కల్ల పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్ బస్ స్టాండ్ల వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల ప్రతిపాదనలను కూడా వేగవంతం చేయాలని సూచించారు. బాలానగర్ లో నేషనల్ హైవే మీద ఉన్న అంబేద్కర్ విగ్రహం షిఫ్టింగ్ విషయంలో తగిన స్థలం లభించలేదని అధికారులు తెలిపారు. ఈ విషయంపై రెవెన్యూ అదనపు కలెక్టర్, బాలనగర్ తహసీల్దార్, ఎన్ హెచ్ఏఐ అధికారులు వెంటనే సరైన స్థలాన్ని గుర్తించి విగ్రహాన్ని షిఫ్ట్ చేసి ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని సూచించారు.


వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి రాయచూర్ రోడ్ పెట్రోల్ బంక్ వరకు ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను సక్రమంగా నిర్మించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఎన్ హెచ్ అధికారులను ఆదేశించారుఅలాగే బైపాస్ రోడ్డుపై కొత్తగా తెరిచిన డివైడర్ల వద్ద బ్యారికేడ్లు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ & బీ అధికారులకు సూచించారు. బైపాస్ రోడ్డుకు సంబంధించి మూడు ప్రాంతాల్లో సైన్‌బోర్డులు, జీబ్రా క్రాసింగ్స్ ఏర్పాటు కోసం 7.5 లక్షల ప్రతిపాదనలు సమర్పించామని, 10 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. జిల్లాలోని జాతీయ రహదారులపై, పట్టణంలోని రహదారులపై, అలాగే బైపాస్ రోడ్డుపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సైన్‌ బోర్డులు, బ్యారికేడ్లు, లైటింగ్ వంటి అన్ని భద్రతా చర్యలు పూర్తి చేసి రోడ్డు ప్రమాదాలను నివారించే విధంగా రోడ్డు భద్రతను పటిష్టం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి, ఆర్&బీ ఈఈ సంద్య, ఎన్.హెచ్ ఆర్ అండ్ బి ఈఈ రమేష్, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ హెచ్ఏఐ సైట్ ఇంజనీర్ భానుమిశ్రా, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, రోడ్డు భద్రతా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story