- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాథమిక పాఠశాలలో గురువుగా మారిన కలెక్టర్
విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై బాగా చదువుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎల్లప్పుడూ వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై బాగా చదువుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎల్లప్పుడూ వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం కేటిదొడ్డి మండలంలోని పాగుంట గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, బోధన విధానం, సౌకర్యాలపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ తప్పనిసరిగ్గా ప్రతిరోజూ తరగతులకు హాజరై.. శ్రద్ధతో చదువుకోవాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల ఎఫ్.ఆర్.ఎస్ హాజరు యాప్ ను పరిశీలించి, ఉపాధ్యాయులు అందరూ పాఠశాలకు సకాలంలో హాజరై 100శాతం హాజరు నమోదు కావాలన్నారు. విద్య అనేది భవిష్యత్ కి పునాది కాబట్టి హాజరును అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారి తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యాలను పరిశీలించి వారికి విద్యాబోధన చేశారు. కొంతమందిని బోర్డుపై చదివించడంతో పాటు ప్రశ్నలు అడిగి వారి విద్య సామర్ధ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులు చదవడం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాథమిక విద్యే జీవితానికి పునాది అని పేర్కొంటూ, అక్షరాభ్యాసం, చదవడం, రాయడం, అర్థం చేసుకునే నైపుణ్యాలు పక్కాగా నేర్పాలని సూచించారు. పునాది బలంగా ఉంటేనే ఉన్నత విద్యలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారని తెలిపారు.
ఆరోగ్యం చాలా ముఖ్యమైనది..
అలాగే పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం పరిశుభ్రమైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమైనదని, విద్యతోపాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధలు వహించాలన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు అధికారులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీలో పెన్షన్ పంపిణీ వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. పోస్టల్ ద్వారా వచ్చే పెన్షన్లు సమయానికి అందుతున్నాయా, బయోమెట్రిక్ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందా అని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పెన్షన్ డబ్బులు సమయానికి అందించబడాలని, బయోమెట్రిక్ విధానాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో కలెక్టర్ మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, తహశీల్దార్ హరికృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి, సర్పంచ్ అంజనప్ప,పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, పోస్టాఫీసు అధికారి లక్ష్మణ్, గ్రామ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.






