విద్యార్థుల ఆందోళనపై స్పందించిన కలెక్టర్.. వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

by Chintha Aamani |

గురువారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు వసతుల కొరతపై రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.

విద్యార్థుల ఆందోళనపై స్పందించిన కలెక్టర్.. వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
X

దిశ,ఉండవెల్లి : గురువారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా లోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు వసతుల కొరతపై రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పాఠశాల‌ను స్వయంగా సందర్శించి, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను విని, పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఏదైనా సమస్యను చట్టబద్ధంగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, మీ భద్రత మాకు అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తున్నామని, రోడ్డెక్కే ప్రయత్నాలు ప్రమాదాలకు దారితీయే అవకాశముండటంతో అలాంటి పరిస్థితి మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకూడదని అన్నారు. పాఠశాలలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్వైజర్ నవీన్‌లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌, వార్డెన్‌, హౌస్‌మాస్టర్‌లపై మెమో జారీ చేసినట్లు తెలిపారు.విద్యార్థులపై బెదిరింపులకు పెడుతున్న పాఠశాల భవన యజమాని పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని, నెల రోజుల్లో అందరికీ సరిపడేలా కొత్త మరుగుదొడ్లు, బాత్రూంలను నిర్మించి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం న్యాయమైన పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలన్నారు. నాణ్యతలేని బియ్యాన్ని వెంటనే తిరిగి పంపి మంచి బియ్యాన్ని తెప్పించుకోవాలని, దీనిలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఇటీవల ఒక విద్యార్థినికి పాము కాటుతో అనుమానంతో ఆసుపత్రికి తరలించిన ఘటనపై ఆమెతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.విద్యార్థుల ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యత గల అంశం కావడంతో, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచి, పాములు, హానికర కీటకాలు దూరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.పాఠశాల పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని స్పష్టంగా పేర్కొన్నారు. పాఠశాల రిజిస్టర్లను తనిఖీ చేసి,ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు శాతం పూర్తిగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ అనీల, ప్రధానోపాధ్యాయులు రామ కృష్ణ, కేజీవీవీ ప్రిన్సిపాల్ పరిమళ,సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్, వార్డెన్ రేణుక, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story