మధ్యాహ్న భోజన నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం 

by Nallavelli.Anjaneyulu |

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత పై కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మధ్యాహ్న భోజన నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం 
X

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత పై కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన, ఆహారం నాణ్యత, మెనూ అమలు విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలను సోమవారం తనిఖీ చేసిన సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తిలో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాల్సిన మెనూను పాటించకపోవడాన్ని గమనించి పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం సోమవారం విద్యార్థులకు కిచిడీ, గుడ్డు, మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ అందించాల్సి ఉండగా పాఠశాలలో మాత్రం వైట్ రైస్, గుడ్డు, సాంబార్ మాత్రమే వడ్డించారని తెలిపారు. విద్యార్థులకు వడ్డించిన అన్నం సరిగా వండకపోవడం, సాంబార్ నాణ్యత కూడా తక్కువగా ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక పాఠశాలల్లో తాను మధ్యాహ్న భోజనం చేసి పరిశీలించినప్పటికీ ఇంత నాసిరకం భోజనం ఎక్కడా తినలేదని పేర్కొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి నిర్లక్ష్యం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల హెడ్‌మాస్టర్ భాస్కర్ రెడ్డి, ఫుడ్ చెకింగ్ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్‌కు ఫోన్ ద్వారా ఆదేశించారు. ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని సూచించారు. రోజువారీ కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని, మధ్యాహ్న భోజన వంట ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని హెడ్‌మాస్టర్‌కు ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. అంతకు ముందు పదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే పరీక్షలను ధైర్యంగా రాసి మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం 128 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ బాదాం రమేష్, ఆర్డీఓ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వార్డు కౌన్సిలర్ నిజాముద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story