అభివృద్ధి పనులపై అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు..

by Kodari Anjali |

వెల్దండ మండలంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ విస్తృతంగా పర్యటించారు.

అభివృద్ధి పనులపై అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు..
X

దిశ, వెల్దండ: ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. గురువారం వెల్దండ మండల కేంద్రంతో పాటు పెద్దాపూర్ గ్రామాలలో జిల్లా కలెక్టర్ పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వెల్దండ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న గృహాలను సందర్శించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ఇంటి నిర్మాణ పనుల స్థితిగతులు, ప్రభుత్వ సహాయం అందుతున్న తీరు, ఎదురవుతున్న సమస్యల గురించి ఆరా తీశారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిర్మాణాలను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న పథకాలను అర్హులందరికీ చేరవేయడం అధికారుల బాధ్యత అని తెలిపారు.

ప్రభుత్వ నిబంధన మేరకు..

ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యానికి తావు లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు సకాలంలో గృహ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వెల్దండ గ్రామానికి చెందిన ఉడుత సుమాతమ్మ భర్త ఉడుత జంగయ్య దివ్యాంగుడని, ఆయనకు సదరం ధ్రువీకరణ పత్రం మంజూరు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అంశాలను పరిశీలించి, ప్రభుత్వ నిబంధన మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడి వసతులు, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు.

తగిన చర్యలు తీసుకుంటాం..

ఈ సందర్భంగా వసతి గృహ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థుల అవసరాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండరాదని స్పష్టం చేశారు. మండలంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

ఇందిరమ్మ ఇళ్లు, తదితర సమస్యలపై..

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అంతకుముందు పెద్దాపూర్ గ్రామంలోని నర్సరీలను పరిశీలించి మొక్కల పెంపకంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ బీసీ హాస్టల్ నూతన భవనం, నూతన గ్రామ పంచాయతీ భవనం మంజూరు, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, తదితర సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ వెంట కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, వెల్దండ తహసీల్దార్ కార్తీక్ కుమార్, ఎంపీడీవో కృష్ణయ్య, ఎంఈవో చంద్రుడు నాయక్, వెల్దండ సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్, పెద్దాపూర్ సర్పంచ్ కేశమల్ల అనూష కృష్ణ, వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, ఆయా గ్రామాల గ్రామపంచాయతీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story