- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
కోడేరు పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలను గూర్చి రోగులను అడిగి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలుసుకున్నారు.

దిశ, కొల్లాపూర్/కోడేరు: ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు సమర్థవంతంగా అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు చికిత్స అందించే విధానం, మౌలిక సదుపాయాలు, మందుల లభ్యత, ప్రసూతి సేవలు, ల్యాబ్ సేవలు, పరిశుభ్రత, సిబ్బంది పనితీరు వంటి పలు అంశాలను కలెక్టర్ పరిశీలించి సంబంధిత వైద్యాధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రికి చేరుకున్న జిల్లా కలెక్టర్‌కు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగుల సంఖ్య, అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, ఔషధ నిల్వలు తదితర అంశాలను వివరించారు. అనంతరం కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శిస్తూ అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసంతో వస్తున్నందున వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న..
రోగులకు, వారి ఆరోగ్య సమస్యలను పూర్తిగా తెలుసుకుని సరైన చికిత్స అందించాలని, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు సకాలంలో రిఫర్ చేయాలని ఆదేశించారు. అవసరమైన అన్ని రకాల మందులు ఆసుపత్రిలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మందుల కొరత కారణంగా ఒక్క రోగి కూడా ఇబ్బంది పడకూడదని, ఔషధ నిల్వలను నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన మేరకు ముందుగానే ఇండెంట్ పంపించాలని వైద్యాధికారులకు ఆయన సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించాల్సిన మందులు పూర్తి స్థాయిలో అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఆరా తీశారు. గత నెలలో, ప్రస్తుత నెలలో నమోదైన గర్భిణీలు, నిర్వహించిన ప్రసవాలు, హైరిస్క్ గర్భిణీల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గత నెలలో నాలుగు ప్రసవాలు నిర్వహించగా, ప్రస్తుత నెలలో ఇప్పటివరకు ఒక్క ప్రసవం కూడా జరగలేదని వైద్యులు వివరించారు. దీనికి ప్రధాన కారణం ఆసుపత్రిలో ప్రస్తుతం రెగ్యులర్ స్టాఫ్ నర్స్ లేకపోవడమేనని వైద్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రసూతి సేవలను పూర్తి స్థాయిలో నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
అవసరమైన అన్ని పరీక్షలు సకాలంలో..
ఈ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, సమస్యను వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)తో చర్చించి రెగ్యులర్ స్టాఫ్ నర్స్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రసూతి సేవలు స్థానికంగానే అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆసుపత్రిలోని ఫార్మసీ విభాగాన్ని పరిశీలించి మందుల నిల్వలు, రికార్డులు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. రోగులకు వైద్యులు సూచించిన మందులు పూర్తిగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రయోగశాలను (ల్యాబొరేటరీ) సందర్శించి నిర్వహిస్తున్న పరీక్షలు, అందుబాటులో ఉన్న పరికరాలు, పరీక్షల నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. అవసరమైన అన్ని పరీక్షలు సకాలంలో నిర్వహించి రోగులకు త్వరితగతిన ఫలితాలు అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు, వార్డులు, చికిత్స గదులు, ఔషధ నిల్వ గదులను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండడంతో పాటు రోగులు, వారి సహాయకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి విభాగంలో పారిశుద్ధ్య ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు మెరుగైన వాతావరణంలో వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా వైద్యులు, సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు.
అంతకుముందు… కోడేరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
ఆసుపత్రి తనిఖీకి ముందు కోడేరు మండల పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం పనులు వేగంగా పూర్తి కావాలనే ఉద్దేశంతో పలు నిర్మాణ ప్రదేశాలను సందర్శించి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలికంటి లక్ష్మి (భర్త: మహేష్) నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటిని సందర్శించిన కలెక్టర్, నిర్మాణ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందని, గృహప్రవేశం ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉందని లబ్ధిదారులను ప్రశ్నించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్దేశిత గడువులోగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు.
అధికారులు క్రమం తప్పకుండా..
మండల పరిధిలో ఇప్పటివరకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల సంఖ్య, నిర్మాణం ప్రారంభమైన ఇళ్ల వివరాలు, వివిధ దశల్లో ఉన్న నిర్మాణాల పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంజూరైన ప్రతి ఇంటి నిర్మాణాన్ని వేగవంతం చేసి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సహకారం, ఇంజినీరింగ్ పర్యవేక్షణ, ప్రభుత్వ మార్గదర్శకాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు అమలు చేస్తున్న ఈ పథకం లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోడేరు సర్పంచ్ నడింపల్లి మహేశ్వర్ రెడ్డి,ఆసుపత్రి వైద్యులు రాజశేఖర్ ఎంపీడీవో విజయలక్ష్మి, హౌసింగ్ ఏఈ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రాజు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






