బాల‌లు ఆన్ లైన్ లో వేధింపుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి : న్యాయ‌మూర్తి ఉప‌నిషాల్వానీ

by Ratna Kumari |

దిశ‌, కొల్లాపూర్ : చిన్నపిల్లల నుంచి కౌమార దశలో ఉన్న బాలల వరకు అంతర్జాలాన్ని ఫోన్ వినియోగించేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు

బాల‌లు ఆన్ లైన్ లో వేధింపుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి : న్యాయ‌మూర్తి ఉప‌నిషాల్వానీ
X

దిశ‌, కొల్లాపూర్ : చిన్నపిల్లల నుంచి కౌమార దశలో ఉన్న బాలల వరకు అంతర్జాలాన్ని ఫోన్ వినియోగించేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతరం పర్యవేక్షణ ఎంతో అవసరమని స్థానిక కోర్టు న్యాయమూర్తి ఉపనిషల్వాని సూచించారు. శ్రామిక వికాస కేంద్రం, చిల్లన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ మీటింగ్ హాల్లో ప్యారా లీగల్ వాలంటీర్లకు, ఉపాధ్యాయులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మహిళా సంఘాల సభ్యురాళ్లకు యువకులకు శనివారం నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అంతర్జాలం, చరవాణి కంప్యూటర్, ట్యాబ్ వంటివి వినియోగించడం ఆవశ్యకమైన సమయంలో పిల్లలు వాటిని వినియోగించేటప్పుడు అనేక రకాల వేధింపులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అతిగా వినియోగించడం వలన బాలలు అనేక రకాల మానసిక ,శారీరక, సామాజిక రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.

అంతర్జాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సామాజిక మాధ్యమాలను అతిగా వినియోగించడం వల్ల వారి జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోతారని ఆమె విచారం వ్యక్తం చేశారు. ప్యారా లీగల్ వాలంటీర్లు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయాల పట్ల విస్తృతంగా ప్రచారం చేయాలని, గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి ఈ విషయం చేరాలని ఆమె సూచించారు. పిల్లలు సాంకేతిక పరిజ్ఞానానికి త్వరగా ఆకర్షితులు అవుతారని, ప్రతిదానికి సమయ పాలన ఉండాలని, అందుకు తగిన జాగ్రత్తలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. జిల్లా బాలల సంక్షేమ సమితి అధ్యక్షులు వై లక్ష్మణరావు మాట్లాడుతూ నానాటికి ఆన్లైన్ వేధింపులు,మోసాలు, నేరాలు పెరిగిపోతున్నాయని, వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అవసరమైన లింకులను ,ఈ మెయిల్ లను ,లక్కీ డ్రా ,బంపర్ డ్రా, ఫేక్ ఉద్యోగ అవకాశం తదితర ఆకర్షణలతో సైబర్ నేరగాళ్లు వల పన్నుతారని, డిజిటల్ అరెస్టు అనేది చట్టంలోనే లేదని, అటువంటి ఫోన్లు కానీ మెసేజ్ లు కానీ వస్తే ప్రజలు భయపడవద్దన్నారు.

వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి రక్షణ పొందాలని సూచించారు. ఆన్లైన్ మోసాల పట్ల 1930 నెంబర్ కు లేదా ,డయల్ 100 కు ఫోన్ చేసి సహాయం పొందాలని ఆయన అన్నారు. బాలలు, మహిళలు సురక్షితంగా ఉండాలని, గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలు నిమిషానికి 16 మంది అంతర్జాలం ద్వారా వేధింపులకు గురవుతున్నారని, దానిని "0" స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా నిరంతరం శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు సంబంధిత శాఖల ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు లక్ష్మణ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ మహేష్, బార్ అసోసియేషన్ సభ్యులు భాస్కర్ రెడ్డి, శివారెడ్డి, మోహన్ లాల్, ఎస్వీకే ప్రాజెక్టు కోఆర్డినేటర్ తిరుపాలు, ఐకేపీ ఏపీఎం అరుణ, అంగన్వాడి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story