భారీ ప్రాజెక్ట్ తో పాలమూరు నీటి కష్టాలకు చెక్

by Ratna Kumari |

మహబూబ్ నగర్ పట్టణంలో తాగునీటి కష్టాలకు భారీ ప్రాజెక్ట్ తో చెక్ పడనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

భారీ ప్రాజెక్ట్ తో పాలమూరు నీటి కష్టాలకు చెక్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ పట్టణంలో తాగునీటి కష్టాలకు భారీ ప్రాజెక్ట్ తో చెక్ పడనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 220 కోట్ల నిధుల వ్యయంతో 1860 కిలో లీటర్ల తో 14 నీటి నిల్వ ట్యాంకుల నిర్మాణం కోసం పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్థలం కోసం పరిశీలించారు. ఈ ట్యాంకులు నిర్మాణం పూర్తయ్యాక నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగి, నగర ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. ప్రగతినగర్‌ లో 18 లక్షల లీటర్లు, పద్మావతి కాలనీలో 15 లక్షల లీటర్లు, సాంబశివుడు దేవాలయం కొండపై 20 లక్షల లీటర్లు, తిరుమల హిల్స్‌లో 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి అనువైన ప్రదేశాలను పరిశీలించారు. నగరంలోని ఈ 14 వాటర్ ట్యాంకులు ఏర్పాటు పూర్తయ్యాక మహబూబ్ నగర్ ప్రజలకు ఇకపై తాగునీటి కొరత ఉండదని, ప్రతి ఇంటికీ సమృద్ధిగా నీరు అందేలా శాశ్వత పరిష్కారం సిద్ధమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం త్వరలోనే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Next Story