పేదల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర : డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్

by Nallavelli.Anjaneyulu |

పేదల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంద‌ని డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ పేర్కొన్నారు.

పేదల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర :   డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్
X

దిశ, హన్వాడ: పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఆరోపించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన సమావేశాల్లో సంజీవ్ ముదిరాజ్ మాట్లాడారు. పీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం హన్వాడ మండలంలోని రామన్నపల్లి, వేపూరు, లింగన్నపల్లి, మాదారం, కొనగట్టుపల్లి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామీణ కూలీల కడుపు నింపే ఉపాధి హామీ చట్టానికి సవరణలు చేపట్టి కేంద్రం విబిజిరాంజీ చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ చట్టం అమలు అయితే కూలీల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా పనులు కల్పించి కూలీల వలసలను నివారించిన ఘనత ఉపాధి హామీ పథకం ద్వారానే సాధ్యమైందన్నారు. కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులు మంజూరు చేసి ఉపాధి హామీ చట్టం ద్వారా కూలీల కుటుంబాలకు సంవత్సరానికి వంద రోజుల పని దినాలను కల్పించే విధానాలను తుంగలో తొక్కి కేంద్రం విబిజిరాంజీ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ చట్టం ద్వారా కేంద్రం భరించాల్సిన నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపి చట్టం అమలు తీరును ప్రశ్నార్థకంగా మార్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని సంజీవ్ ముదిరాజ్ ఆరోపించారు. దీన్ని ప్రతి ఒక్కరు అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువత, విద్యావంతులు, మహిళలు చైతన్యమై మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా పునరుద్ధరించాలని, వీబీజీ రామ్ జీ చ‌ట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య, హన్వాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్, మహిళా అధ్యక్షురాలు నవనీత, డీసీసీ కార్యదర్శి టంకర కృష్ణయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.

Next Story