- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశాభివృద్ధికి జన గణన కీలకం : రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ
దేశాభివృద్ధికి ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలు, తదితర అంశాలకు జన గణన-2027 కీలకమని రెవెన్యూ అదనపు కలెక్టర్ జెఎల్ బి హరిప్రియ అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : దేశాభివృద్ధికి ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలు, తదితర అంశాలకు జన గణన-2027 కీలకమని రెవెన్యూ అదనపు కలెక్టర్ జెఎల్ బి హరిప్రియ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జన గణన-2027 నిర్వహణపై జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాస్థాయిలో రెండు దశల్లో నిర్వహించే జన గణన సమర్థమంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మే మొదటి దశలో ప్రారంభమయ్యే ఇళ్ల జాబితా (హౌస్ లిస్టింగ్, హౌస్ ఎన్యూమరేషన్) గృహాల గణన జూన్ 9 వరకు కొనసాగుతుందని, రెండవ దశ ప్రక్రియ 2027 ఫిబ్రవరి లో నిర్వహించబడుతుందని, 2027 మార్చి1న రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారని ఆమె అన్నారు. ఈసారి జరగనున్న జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని, మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు అంటే ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. మొదటి దశలో నిర్వహించబడే ఇళ్ల జాబితా మరియు గృహాల గణనలో ఇంటి నిర్మాణం (కచ్చా పక్కా,తదితర,) ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, త్రాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని ఈ శిక్షణలో వివరించనున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాలను, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి, గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలి అనే అంశాలపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, జెడ్పి సీఈఓ అండ్ ఇంచార్జి డిపిఓ వెంకట రెడ్డి, సిపిఓ రవీందర్, డిఈఓ ప్రవీణ్ కుమార్, ఆర్డీఓ నవీన్ మునిసిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.






