మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్‌ దూకుడు

by Nallavelli.Anjaneyulu |

జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీట్ పెరుగుతుంది.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్‌ దూకుడు
X

దిశ, జోగులాంబ ప్రతినిధి : జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీట్ పెరుగుతుంది. బీఆర్‌ఎస్ పార్టీ ఈసారి దూకుడుగా ముందుకు సాగుతోంది. మాజీ మున్సిపాలిటీ ఛైర్మన్ బీఎస్ కేశవ్‌ను ఛైర్మన్ అభ్యర్థిగా బీఆర్‌ఎస్ అధికారికంగా ప్రకటన చేసింది. గతంలో బీఆర్ఎస్ తరపున ఛైర్మన్‌గా పని చేసిన బీఎస్ కేశవ్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ గద్వాలలో తన పాత పట్టును మళ్లీ బలోపేతం చేసుకోవడానికి పూర్తి సన్నద్ధత చూపిస్తోంది. మాజీ ఛైర్మన్ కేశవ్ చేరికతో పాటు పలువురు స్థానిక నాయకులు, మాజీ కౌన్సిలర్లు కూడా బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని స్థానిక వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఛైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఛైర్మన్ పోస్టు కోసం రెండు పార్టీల్లోనూ అంతర్గత విభేదాలు, గ్రూపిజం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో టికెట్ల కేటాయింపు ప్రక్రియ తలనొప్పిగా మారింది. ఇక బీజేపీ విషయానికొస్తే.. అన్ని వార్డుల్లోనూ బలమైన అభ్యర్థులను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక స్థాయిలో పార్టీకి తగినంత బలం లేకపోవడం, అభ్యర్థుల కొరత వంటి సమస్యలు బీజేపీకి సవాలుగా మారాయి.

కాంగ్రెస్‌లో గ్రూప్ విభేదాలు

బీ ఫామ్‌లు ఎవరికి..? సరితా తిరుపతయ్యాకా? బండ్ల కృష్ణమోహన్ రెడ్డికా? మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోవడంతో ఛైర్మన్ అభ్యర్థిత్వం, బీ ఫారమ్‌ల (నామినేషన్ ఫారమ్‌లు) కేటాయింపు విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మాజీ జెడ్పి ఛైర్పర్సన్ సరితా తిరుపతయ్యకు బీ ఫామ్‌లు దక్కుతాయా? లేక భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి దక్కుతాయా? అనేది పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయించాల్సి ఉంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తన రాజకీయ అనుభవంతో పార్టీలో, ప్రభుత్వం లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన చేరికతో కాంగ్రెస్ బలోపేతమైనది. ఆయనకే బీ ఫారమ్‌లు దక్కుతాయని ఆయన మద్దతుదార్లు తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా బి ఫార్మ్ ల విషయంపై అధికారిక నిర్ణయం తీసుకోలేదు. పార్టీ హైకమాండ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. "గ్రూప్ విభేదాలు వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయి. కాంగ్రెస్‌లోని ఈ అస్థిరత ఆ పార్టీ ఎన్నికల అవకాశాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే దూరం..?

గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సమీపిస్తున్న నేపథ్యంలో, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూరంగా ఉంటారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం (ఆంటీ-డిఫెక్షన్ లా) కింద ఆయనపై కేసు ఇంకా పెండింగ్‌లో ఉండటం, కోర్టు విచారణలు కొనసాగుతుండటం వల్ల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున బహిరంగ ప్రచారం నిర్వహించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరడం, బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన ఫిరాయింపు పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణ జరిపి, ఆధారాల లోపం వల్ల ఐదుగురు ఎమ్మెల్యేలపై (బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహా) అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. అయినప్పటికీ, కొన్ని కేసులు సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బహిరంగంగా ప్రచారంలో పాల్గొంటే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవచ్చని, అందుకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్ గా మారింది. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రచారంలో లేకుండా మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఇబ్బందికర పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీలకు అందివచ్చే అవకాశంగా మారింది.

బీజేపీ సత్తా చాటాలని దూకుడు ప్రయత్నాలు

గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈసారి తన సత్తా చాటాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే డీకే భరత్ సింహ రెడ్డి, ఎంపీ డీకే అరుణలు ఈ ఎన్నికలను పెద్ద సవాలుగా తీసుకుని, పూర్తి సన్నద్ధత చూపిస్తున్నారు. అన్ని వార్డుల్లో బలమైన, ప్రభావవంతమైన అభ్యర్థులను నిలబెట్టడానికి పార్టీ పావులు కదుపుతోంది. ఎలాగైనా ఈసారి మున్సిపాలిటీ ఛైర్మన్ స్థానాన్ని సాధించాలని బీజేపీ నేతలు తీవ్రంగా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే డీకే భరత్ సింహ రెడ్డి స్థానిక స్థాయిలో పార్టీ కార్యకర్తలను ఏకం చేసి, అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ఎంపీ డీకే అరుణ కూడా ఈ ఎన్నికలను సవాలుగా తీసుకొని, వార్డు స్థాయిలో పార్టీ బలోపేతం కోసం వ్యూహాలు రూపొందిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలతో తీవ్ర పోటీ పడనుంది. బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే ఛైర్మన్ అభ్యర్థిగా బీఎస్ కేశవ్‌ను ప్రకటించి దూకుడుగా ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, ఎమ్మెల్యే ప్రచారంలో దూరం వంటి సమస్యలు ఉన్నాయి. ఈ పరిస్థితిని బీజేపీ తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఏదేమైనా ఈ సారి జరిగే మున్సిపల్ ఎన్నికలలో మూడు ప్రధాన పార్టీ లు సవాలుగా తీసుకొని ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

Next Story