- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రాకకు ముమ్మరంగా ఏర్పాట్లు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల నాలుగు, ఐదు తేదీలలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల నాలుగు, ఐదు తేదీలలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజులపాటు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అధికారుల సారథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడడంతో పాటు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు జీఎంఆర్, ఎన్నం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, మెగా రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల నాలుగో తేదీన సాయంత్రం మూడు గంటల వరకు కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంలో పాల్గొని నేరుగా మక్తల్ కు రానున్నట్లు సమాచారం. ఇక్కడ చేపడుతున్న మక్తల్.. నారాయణపేట.. కొడంగల్ ఎత్తిపోతల, కృష్ణ నదిపై కర్ణాటక రాష్ట్రంతో కలిసి నిర్మించనున్న రెండు బ్రిడ్జిలు తదితర అంశాలను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
ఇదే సందర్భంలో జూరాల, కోయిల సాగర్, ఆర్డీఎస్ తదితర ప్రాజెక్టులను గురించి అధికారులతో చర్చిస్తారు అని సమాచారం. అనంతరం సాయంత్రం 6:30 గంటల లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సోమశిల కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఐదవ తేదీ ఉదయం నుండి పాలమూరు.. రంగారెడ్డి ఎత్తిపోతల లో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భూత్పూర్ మండల పరిధిలోని కరివెన రిజర్వాయర్ కు చేరుకొని రిజర్వాయర్ స్థితిగతులను స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్షించిన తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతారు. సాయంత్రం జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకొని.. రిజర్వాయర్ ను పరిశీలిస్తారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు.
ఏర్పాట్ల పై మంత్రుల సమీక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, తదితర అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ... ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన జరిపే ప్రదేశాలలో ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు విషయంపై అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు మంత్రులకు తెలిపారు.






