- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉదండాపూర్ నిర్వాసితులకు మరో రూ.150 కోట్లు
ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ప్రభుత్వం మరో రూ.150 కోట్లను విడుదల చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు.

దిశ, జడ్చర్ల : ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ప్రభుత్వం మరో రూ.150 కోట్లను విడుదల చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు ఉదండాపూర్ నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద విడుదల చేసిన మొత్తం రూ.400 కోట్లకు చేరిందని తెలిపారు. ఉదండాపూర్ నిర్వాసితులకు చెల్లించాల్సిన మిగిలిన బకాయి మొత్తాన్ని ఏప్రిల్ నెలలో ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ లోని జలసౌద లో ఈనెల 8న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పై జరిగిన అధికారిక సమీక్షా సమావేశం లో ఉదండాపూర్ నిర్వాసితులకు చెల్లించాల్సిన బకాయిల విషయాన్ని సోమవారం మీడియాకు వెల్లడించారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో భాగంగా ఉదండాపూర్ నిర్వాసితులకు ఇచ్చే పరిహారాన్ని రూ.18 లక్షలకు పెంచడం, ఈ కారణంగా నిర్వాసితులకు అదనంగా రూ.146 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించడానికి ప్రభుత్వం గతంలోనే అంగీకరించిందని, పెంచిన ఈ పరిహారంతో కలిసి ప్రస్తుతం ఉదండాపూర్ నిర్వాసితులకు రూ.338 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఈ మొత్తాన్ని రెండు నెలల్లో నిర్వాసితులకు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ కూడా ఇచ్చారని తెలిపారు. రెండు నెలల్లోపుగా ఉదండాపూర్ నిర్వాసితులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే మార్చి నెలలో విడుదల చేయాల్సిన రూ.150 కోట్లను ప్రస్తుతం విడుదల చేసిందని వెల్లడించారు.
నిర్వాసితులకు చెల్లించాల్సిన మిగిలిన బకాయి మొత్తాన్ని కూడా ఏప్రిల్ నెలలో తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. ప్రస్తుతం ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.150 కోట్లు విడుదల చేసినందుకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కలకు అనిరుధ్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా నిర్వాసితులను రోడ్లపాలు చేసారని విమర్శించారు. రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన ఏడాది కాలంలోనే ఇప్పటి వరకూ రూ.250 కోట్లను విడుదల చేసారని, ప్రస్తుతం విడుదల చేసిన రూ.150 కోట్లతో కలిపి ఈ మొత్తం ఇప్పుడు రూ.400 కోట్లకు చేరిందని అనిరుధ్ రెడ్డి వివరించారు.
ఉదండాపూర్ నిర్వాసితులలో మరింత ఎక్కువ పరిహారాన్ని కోరుతూ కొంత మంది కోర్టుకు వెళ్ళడం జరిగిందని వారితో కూడా మాట్లాడి వారికి రావాల్సిన పరిహారాన్ని కూడా అందరితో పాటు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ఇది వరకే మంత్రి ఉత్తమ్ ను కోరామని తెలిపారు. ఉదండాపూర్ నిర్వాసితులకు రావాల్సిన బకాయిలను పూర్తిగా ఇప్పించడంతో పాటుగా గతంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు వారికి కేటాయించిన ప్లాట్లను రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగిందని అదే విధంగా ఉదండాపూర్ నిర్వాసితులకు ఇస్తున్న ప్లాట్లను కూడా రిజిస్టర్ చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ఈ విషయం గురించి ఇదివరకే కలెక్టర్ తో కూడా మాట్లాడానని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.






