ఖమ్మం కవి మంత్రిప్రగడ శ్రీనివాసరావుకు అంతర్జాతీయ సాహిత్య పురస్కారం

by Ratna Kumari |

ఖమ్మానికి చెందిన ప్రముఖ కవి, రచయిత మంత్రిప్రగడ శ్రీనివాసరావు అరుదైన అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని అందుకొని జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.

ఖమ్మం కవి మంత్రిప్రగడ శ్రీనివాసరావుకు అంతర్జాతీయ సాహిత్య పురస్కారం
X

దిశ, ఖమ్మం కల్చరల్ : ఖమ్మానికి చెందిన ప్రముఖ కవి, రచయిత మంత్రిప్రగడ శ్రీనివాసరావు అరుదైన అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని అందుకొని జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ) ఆధ్వర్యంలో అమెరికాలోని నార్త్ కరోలినాలోని షార్లెట్ నగరంలో ఈ నెల 17 నుంచి 19 వరకు నిర్వహించిన ప్రతిష్ఠాత్మక మెగా కన్వెన్షన్ మహాసభల్లో అంతర్జాతీయ స్థాయి సాహిత్య ఎక్సలెన్సీ అవార్డ్స్ పోటీలు నిర్వహించారు. ఇందులో కవితల విభాగంలో మంత్రిప్రగడ శ్రీనివాసరావు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయరచయితలు కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, జానపద గాన కోకిల డాక్టర్ అరుణ సుబ్బారావు, ప్రముఖ కార్డియాలజిస్ట్, సాహితీవేత్త డాక్టర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, టీటీఏ సాహిత్య సావనీర్ కమిటీ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, రాజశ్రీతో పాటు ఇతర కమిటీ సభ్యుల చేతుల మీదుగా అందుకున్నారు.

అవార్డుతో పాటు సుమారు రూ.9 వేల నగదు బహుమతిని కూడా ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అమెరికాలో నివసిస్తున్న తన కుమార్తె, అల్లుడు, కుమారుడిని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈ సాహిత్య పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ వేదికపై విజేతగా నిలవడం విశేషమని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రిప్రగడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలుగు సాహిత్య వికాసానికి, సేవా కార్యక్రమాలకు టీటీఏ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కొద్ది రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన తనకు అంతర్జాతీయ వేదికపై ఈ పురస్కారం లభించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఈ గుర్తింపును స్ఫూర్తిగా తీసుకొని మరింత బాధ్యతతో సాహిత్య సేవకు అంకితమవుతానని తెలిపారు.

Next Story