- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ అక్రమాలపై మరోసారి ఫిర్యాదు
మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాల వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది.

దిశ, ఊట్కూర్ : మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాల వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ఉపాధి కోసం ముంబై కి వలస వెళ్లిన కూలీల పేర్లపై తప్పుడు హాజరులు నమోదు చేసి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఘటనపై గ్రామ ప్రజలు సోమవారం ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న క్షేత్ర సహాయకుడు వలస వెళ్లిన కూలీల పేర్లపై హాజరులు నమోదు చేసి డబ్బులు మంజూరు చేయించారు. కూలీల ఖాతాల్లో జమ కావడంతో .. ఆ డబ్బులు తీసి తనకు ఇవ్వాలని బాధితులను బెదిరించినట్లు గ్రామ ప్రజలు తెలిపారు.
ఈ వ్యవహారంపై గతంలో గ్రామస్తులు ఫిర్యాదు చేయగా.. సంబంధిత అధికారులు గ్రామానికి వచ్చి విచారణ నిర్వహించారు. విచారణ సందర్భంగా వలస వెళ్లిన వారి పేర్లపై హాజరులు నమోదు చేసిన విషయాన్ని క్షేత్ర సహాయకుడు స్వయంగా ఒప్పుకున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి విచారణ చేయకుండా తప్పుడు నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అవినీతి జరిగినట్టు బాధితులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర సహాయకుడు ను వెంటనే విధుల నుంచి తొలగించి, సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు.






