ప్రజల భద్రతే లక్ష్యం.. నేరగాళ్లపై నిఘా : ఎస్పీ టీ. శ్రీనివాస్ రావు

by Nallavelli.Anjaneyulu |

దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు తీసుకున్న పటిష్ట చర్యల వల్ల నేరాల

ప్రజల భద్రతే లక్ష్యం.. నేరగాళ్లపై నిఘా : ఎస్పీ టీ. శ్రీనివాస్ రావు
X

దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు తీసుకున్న పటిష్ట చర్యల వల్ల నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని ఎస్పీ టీ. శ్రీనివాస్ రావు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల‌ సమావేశంలో ఆయన 2025 సంవత్సరపు వార్షిక నేర నివేదికను గణాంకాలతో సహా వివరంగా వెల్లడించారు.

నేరాల నియంత్రణలో పురోగతి

గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో నేరాలు 11 శాతం మేర తగ్గాయని ఎస్పీ వివరించారు. 2024లో 2703 ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగా.. 2025లో ఆ సంఖ్య 2410కి పరిమితమైంది. ముఖ్యంగా గంభీరమైన నేరాలు (Grave Crimes) 42 శాతం తగ్గడం పోలీసుల పనితీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది 161 గంభీర నేరాలు నమోదు కాగా, ఈ ఏడాది అవి 92కి తగ్గాయి.

ఆస్తి రికవరీ, మిస్సింగ్ కేసులు

ఆస్తి సంబంధిత నేరాలు 31 శాతం తగ్గాయని, నమోదు అయిన కేసుల్లో 76 శాతం డిటెక్షన్ సాధించి సుమారు రూ. 96,35,000 విలువైన సొత్తును రికవరీ చేశామని ఎస్పీ చెప్పారు. అలాగే జిల్లాలో నమోదైన 177 మిస్సింగ్ కేసుల్లో ఇప్పటికే 165 మందిని ట్రేస్ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో భాగంగా CEIR పోర్టల్ ద్వారా 2100 మొబైళ్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశామన్నారు.

మహిళా భద్రత - చిన్నారుల రక్షణ

మహిళల రక్షణ కోసం జిల్లాలో షీ టీమ్స్, భరోసా కేంద్రాలు చురుగ్గా పనిచేస్తున్నాయని ఎస్పీ తెలిపారు. షీ టీమ్స్ ద్వార 136 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 113 పెట్టీ కేసులు, 9 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. జిల్లా భరోసా కేంద్రంలో 81 మంది బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి, 53 మందికి వైద్య సహాయం అందించారు. ఆపరేషన్ స్మైల్ ,ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా 97 మంది బాలురు, 19 మంది బాలికలను రక్షించినట్లు వివరించారు.

రోడ్డు భద్రత ఎన్‌ఫోర్స్‌మెంట్

నేషనల్ హైవే, స్టేట్ హైవేలపై ప్రమాదాల నివారణకు ఈ ఏడాది ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ తెలిపారు. మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకపోవడం వంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఉక్కుపాదం మోపుతూ.. గత ఏడాది 3200 కేసులు ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్యను 7056కు పెంచి భారీగా జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.

సాంకేతికత - సామాజిక స్పందన

పోలీసింగ్ రంగంలో సాంకేతికతను జోడించి నేరాలను అదుపు చేస్తున్నామని, టీఎస్ కాప్ అప్లికేషన్ ద్వారా నేరగాళ్లపై నిఘా ఉంచామని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ సైబర్ నేరాలపై 656 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ ఏడాది లోక్ అదాలత్ ద్వారా 815 కేసులు, పెట్టీ కేసుల కింద 22,000 కేసులు పరిష్కరించి జిల్లాను వివాద రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించిన మీడియాకు, ప్రజలకు ఎస్పీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో గద్వాల జిల్లాను మరింత సురక్షితంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.

Next Story