ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి

by Taduka Kalyani |

వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి
X

దిశ, గద్వాల కలెక్టరేట్/ ధరూర్ : వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ధరూరు రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విత్తన ప్రదర్శన స్టాళ్లను సందర్శించి రైతులకు మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా జిల్లాలోని 13 మండలాల రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ సాగు విధానాలకు బదులుగా పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు.ప్రస్తుతం వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడం,ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో సాగునీటి లభ్యత పరిమితంగా ఉండే అవకాశం ఉందన్నారు. అందువల్ల అధిక నీటి అవసరమున్న వరి సాగును వీలైనంత మేర తగ్గించి,తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.వరికి బదులుగా కంది,పెసర, మినుము, శనగ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, వేరుశెనగ, నువ్వులు, వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.ఈ పంటల సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో మెరుగైన దిగుబడులు, గిట్టుబాటు ధరలు లభించి రైతులు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

వ్యవసాయంతో పాటు ఉద్యాన సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

అలాగే రైతులు పండ్ల తోటలు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత ఇస్తే అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.ప్రభుత్వం ఉద్యాన పంటలకు అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకుని సాగు విస్తీర్ణాన్ని పెంచి లాభదాయక వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ శాస్త్రీయ సాగు విధానాలను అవలంబించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విత్తనాలు,సాంకేతిక సేవలు, పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టాలన్నారు. పశువులకు తాగునీరు, మేత కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. చెరువులు, కుంటలు, కాలువలను సంరక్షించి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప మాట్లాడుతూ,వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు దీర్ఘకాలిక రకాల కంటే స్వల్పకాలిక, ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవసాయ శాఖ సాంకేతిక సూచనలను పాటించాలని సూచించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ... పండ్ల తోటలు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని,ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, ధరూర్ సర్పంచ్ డిఆర్ విజయ్, ఏడీఏ, ఎంఏఓలు, ఏఈఓలు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Next Story