- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లమల్ల చెంచుల అభివృద్ధికి అన్ని శాఖలు పని చేయాలి : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నల్లమలలో జీవిస్తున్న చెంచు గిరిజనుల అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు.

దిశ, అచ్చంపేట : నల్లమలలో జీవిస్తున్న చెంచు గిరిజనుల అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం అమ్రాబాద్ మండలం ఐటీడీఏ మన్ననూరులో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..చెంచు గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చెంచు పెంటలలో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు. చెంచు గిరిజనులు, అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలవారి అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని, చెంచు కుటుంబాలకు విద్య, ఆరోగ్యం, తాగునీరు, పోషకాహారం, వనరులు, విద్యుత్, ఉపాధి అవకాశాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే విద్యాశాఖ పనితీరును సమీక్షిస్తూ చెంచు గుడాలల్లో పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, వసతి గృహాల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు, డ్రాప్‌అవుట్‌ల నివారణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెంచు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు, టీకాలు, పోషకాహార కార్యక్రమాలు క్రమం తప్పకుండా అందేలా చూడాలని, ప్రతి చెంచు పెంటకు ఆరోగ్య సిబ్బంది క్రమం తప్పకుండా వెళ్లి వైద్య సేవలు అందించడంతో పాటు సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని వైద్య అధికారులను ఆదేశించారు.
తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, చెంచు పెంటలలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పనిచేయని బోర్లు, పైపులైన్లు, నీటి సరఫరా వ్యవస్థలను వెంటనే మరమ్మతు చేసి ప్రజలకు నిరంతర నీటి సరఫరా కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. చెంచు యువత ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. యువతకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వ శాఖలు, ఐటీడీఏ, ఇతర సంస్థల సహకారంతో చెంచు యువతకు ఉపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. చెంచు కుటుంబాలకు ఉపాధి, జీవనోపాధి అవకాశాల పెంపు కోసం లైవ్లీహుడ్ (Livelihood) కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. రేషన్ కార్డుల సమస్యలు, ఆధార్ సంబంధిత ఇబ్బందులు, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న చెంచు పెంటలను గుర్తించి అక్కడ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నెట్‌వర్క్ సౌకర్యం లేని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు తాత్కాలిక (టెంపరరీ) సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆధార్, రేషన్ కార్డు, ప్రభుత్వ ధ్రువపత్రాలు సేవలు సకాలంలో అందేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గిరిజనులకు సేవలందించడంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సమన్వయంతో పని చేయాలని, ప్రతి చెంచు కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, ఇన్ చార్జి డీటీడబ్ల్యూఓ ఉమాపతి, పీడీ పీఆర్డిఏ చిన్న ఓబులేసు, మిషన్ భగీరథ ఈఈ హేమలత ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్ జాఫర్ హుస్సేన్ పాల్గొన్నారు.






