- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని లోతట్టు ప్రాంతమైన సలేశ్వరం జాతరకి ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తుంటారు.

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని లోతట్టు ప్రాంతమైన సలేశ్వరం జాతరకి ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 01 నుంచి 03 వరకు సలేశ్వరం జాతర జరుగనుంది. జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తో కలిసి సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ సలేశ్వరం జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని.. ఇందుకు సహకరించాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రమాదవశాత్తు అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అటవీశాఖ సిబ్బందితో కలిసి పోలీస్ శాఖ బందోబస్తు నిర్వహించాలని, రాత్రి సమయంలో పాదయాత్ర చేసే భక్తులకు మధ్య మధ్యలో సోలార్ లైట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నాగర్ కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపోల నుంచి భక్తుల సౌకర్యార్థం బస్సులను ఏర్పాటు చేయాలని నాగర్ కర్నూలు డీఎం ను కలెక్టర్ ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ తరపున ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యసిబ్బందిని అంబులెన్స్ లో పర్యవేక్షణ జరిపేలా ఏర్పాటు చేయాలన్నారు.
కింద గుండం దగ్గర వైద్య సిబ్బంది అన్ని రకాల సదుపాయాలతో సంసిద్ధంగా ఉండాలని డీఎంహెచ్ఓ ను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని తెలిపారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని.. వేసవి కాలంలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆర్ డబ్ల్యూయస్ ఈఈని కలెక్టర్ ఆదేశించారు. సలేశ్వరం జాతరకు వచ్చే వాహనాలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని, వాహనాల అనుమతి తదితర అంశాలను పోలీస్, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమాల్లో భాగంగా అడవిలో ప్లాస్టిక్ వినియోగించకుండా చూడాలని, రెండు రోజుల్లో అన్ని శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తాను కూడా పర్యటించి, పకడ్బందీ ఏర్పాట్లు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సలేశ్వరం జాతరకు వారు రావద్దు
సలేశ్వరం జాతరకు గర్భిణీ మహిళలు, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు సలేశ్వరం జాతరకు రాకుంటే మంచిదని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, టాపిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు కమిటీ సభ్యులు చెంచు సంఘాల నాయకులు పోలీస్ శాఖకు సహకారాలు అందించాలని, సలేశ్వరం జాతరను అత్యంత పకడ్బందీగా సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ డబ్లూఎస్ డీఈ హేమలత, వివిధ శాఖల అధికారులు, సలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులు, చెంచు సంఘాల నాయకులు లింగస్వామి, గురువయ్య, ఈర్లపెంట సర్పంచ్ శివమ్మ పాల్గొన్నారు.






