- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన అంగన్ వాడీ ఉద్యోగులపై వేటు
నాగర్ కర్నూల్ జిల్లాలో విధులకు హాజరుకాని మూడు ప్రాజెక్టుల్లో 8 మంది అంగన్‌వాడీ సిబ్బందిపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ శుక్రవారం వేటు వేశారు.

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలో విధులకు హాజరుకాని మూడు ప్రాజెక్టుల్లో 8 మంది అంగన్‌వాడీ సిబ్బందిపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ శుక్రవారం వేటు వేశారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో క్రమశిక్షణను పటిష్టపరచడంతో పాటు సేవల నాణ్యతను మెరుగుపరచే దిశగా జిల్లా పరిపాలన కీలక చర్యలకు పూనుకుంది. అందుకు సంబంధించిన ప్రకటనలను కలెక్టర్ కార్యాలయం నుంచి విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎంఎస్. నెం.14 నిబంధనల మేరకు, దీర్ఘకాలంగా విధులకు హాజరు కాకుండా ఉన్న 8 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సేవలను రద్దు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న కొంతమంది కార్యకర్తలు, ఆయాలు ఎలాంటి అనుమతి లేకుండా నెలల తరబడి, మరి కొందరు సంవత్సరాల పాటు విధులకు గైర్హాజరవుతూ కేంద్రాల నిర్వహణకు ఆటంకం కలిగించినట్టు వెల్లడించారు.
సంబంధిత శాఖల నివేదిక ఆధారంగా..
సంబంధిత శాఖ అధికారుల నివేదికలు, విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు చేపట్టి వారి సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంతో పాటు ఆరోగ్య సేవలు అందించే కీలక వ్యవస్థగా ఉన్నందున సిబ్బంది నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవడం అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని అచ్చంపేట, బల్మూర్, కొల్లాపూర్ ప్రాజెక్టుల పరిధిలో పని చేస్తున్న పలువురు అంగన్‌వాడీ సిబ్బంది 2023 ఫిబ్రవరి నుంచి 2026 జనవరి వరకు వివిధ కాలాల్లో విధులకు గైర్హాజరవుతున్నట్లు రికార్డులు వెల్లడించినట్లు తెలిపారు. సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం వారి తొలగింపునకు ప్రతిపాదనలు సమర్పించగా.. వాటికి ఆమోదం లభించినట్లు చెప్పారు.
వేటుపడిన అంగన్ వాడీ ఉద్యోగులు..
తొలగింపునకు గురైన వారిలో అచ్చంపేట ప్రాజెక్టుకు చెందిన జి. వెంకటమ్మ, ఎస్. అరుణ, బల్మూర్ ప్రాజెక్టుకు చెందిన జి. సుల్తానమ్మ, జె. మహాలక్ష్మి, కొల్లాపూర్ ప్రాజెక్టుకు చెందిన సి. పద్మావతి, నిరంజన్‌బెల్ల, కాశమ్మ, దర్జి బక్కమ్మ, ఉన్నారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ విధుల పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని, అనధికార గైర్హాజరు లేదా విధుల పట్ల నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై భవిష్యత్తులో కూడా ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ సేవల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల సేవల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తమ విధులను బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆయన సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం లేదా క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.






