- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న జూనియర్
మక్తల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జూనియర్ అధికారి అవినీతి చక్రం.. నాలా లేకుండానే రిజిస్ట్రేషన్లు.. ఇటీవల ఏసీబీ దాడుల నుంచి రెప్పపాటులో ఎస్కేప్!

దిశ, మక్తల్: మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నియోజకవర్గ కేంద్రంలో క్యాబినెట్ హోదా గల స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పక్కా భవనాలు, నిధులు మంజూరు చేయిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫుల్ చార్జ్ అధికారులు ఉండాలని శ్రమిస్తుంటే ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా నడుస్తోంది. గత నాలుగేళ్లుగా ఇక్కడ శాశ్వత సబ్ రిజిస్ట్రార్ లేకుండా కేవలం ఇన్‌ఛార్జిలతోనే పబ్బం గడుపుతున్నారు. దీని వెనుక కార్యాలయంలోనే తిష్టవేసిన ఒక సీనియర్ అధికారి 'చక్రం' తిప్పుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటేషన్‌పై వచ్చే ఏ అధికారి అయినా అవినీతికి సహకరించకపోతే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వకుండా సదరు అధికారి అడ్డంకులు సృష్టిస్తూ చక్రం తిప్పే తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
అంతా ఆయన ఇష్టమే!
గత కొన్ని సంవత్సరాల క్రితం మక్తల్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి క్లర్క్‌గా వచ్చిన ఒక జూనియర్ అసిస్టెంట్ పదోన్నతి పొంది గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే అసిస్టెంట్ అధికారిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలంగా ఒకే చోట పాతుకుపోవడం తో స్థానిక రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, బడాబాబులతో సదరు అధికారికి బలమైన ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఏర్పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. చట్టంలోని లొసుగులను వాడుకుంటూ, కోర్టు వివాదాల్లో ఉన్న ప్లాట్లను సైతం పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు కార్యాలయానికి వచ్చే బాధితులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. గతంలో ఇన్‌ఛార్జిగా వచ్చిన ఒక మహిళా అధికారి ఇలాంటి వివాదాస్పద ప్లాట్ల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించగా, బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తృటిలో ఇన్‌ఛార్జి బాధ్యతలను వదులుకుని దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా పై అంతస్తులో ఆఫీసు!
సాధారణంగా వృద్ధులు, వికలాంగులు, క్రయ విక్రయ దారులకు అందుబాటులో ఉండేలా రిజిస్ట్రేషన్ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ (కింది అంతస్తు)లోనే ఉండాలి. కానీ, మక్తల్‌లో అన్ని నిబంధనలను పక్కనబెట్టి ఒక ప్రైవేట్ బిల్డింగ్ పై అంతస్తులో ఆఫీసును ఎంపిక చేశారు. ఈ భవన ఎంపిక వెనుక పెద్ద ఎత్తున అక్రమంగా డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నాలా లేదు.. పర్మిషన్ లేదు.. అంతా సబ్ రిజిస్ట్రార్ సాకారమే!
కొందరు బడా రియల్టర్లు వ్యవసాయ భూములను అక్రమంగా వెంచర్లుగా మార్చి ఎలాంటి నాలా(నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్‌మెంట్) అనుమతులు లేకుండానే గుంటలు, సెంట్ల చొప్పున అమ్ముకుంటున్నారు. వీరికి సదరు అధికారి పూర్తి సహకారం అందిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక కార్యాలయానికి కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన స్టాంపు వెండర్లను ఆఫీస్ పక్కనే కూర్చోబెట్టుకుని అమ్ముకునేలా సహకరిస్తున్నారని, నిబంధనల ప్రకారం నడుచుకునే లైసెన్స్‌డ్ వెండర్లకు కృత్రిమంగా స్టాంపుల కొరత సృష్టిస్తున్నారని వెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏసీబీ నుంచి రెప్పపాటులో ఎస్కేప్!
ఈ కార్యాలయంపై ఇప్పటివరకు మూడు సార్లు ఏసీబీ దాడులు జరిగాయి. ఇటీవల నాలుగోసారి కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా, సదరు చక్రం తిప్పే అధికారి రెప్పపాటు కాలం లో తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. నియోజకవర్గ ప్రతిష్టను మసకబారుతున్న ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అవినీతి బాగోతంపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, సమగ్ర విచారణ జరిపి కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని మక్తల్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.






